న్యూయార్క్ విమానాశ్రయంలో భారతీయ నటుడి తిప్పలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ సౌత్ సినిమాల్లోను పాపులరైన సంగతి తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ సౌత్ సినిమాల్లోను పాపులరైన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహోలో ప్రతినాయక పాత్రలో నటించాడు. దళపతి విజయ్ - కత్తి సినిమాల్లోను అతడు కీలక పాత్రతో ఆకట్టుకున్నాడు. నీల్ ప్రస్తుతం వ్యంగ్య యాక్షన్ కామెడీ `హిసాబ్ బరాబర్`లో కనిపిస్తున్నాడు. అశ్విని ధీర్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, కీర్తి కుల్హారి, రష్మి దేశాయ్ లాంటి దిగ్గజ తారలు నటించారు. ఆర్థిక మోసాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే నీల్ నితిన్ రాంగ్ రీజన్‌తో ఇప్పుడు వార్తల్లోకొచ్చాడు. అతడిని అమెరికా న్యూయార్క్ విమానాశ్రయంలో నాలుగు గంటలు పైగా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్భంధించారు. అతడి జాతీయతను సందేహించడమే కాకుండా, తన పూర్వీకులకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సిందిగా అధికారులు నిలదీసారు. తాను ఎవరో చెప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారట. తన వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నా, తనను నమ్మడానికి అధికారులు నిరాకరించారని అతడు ఆవేదన చెందాడు.
చివరికి ఈ సన్నివేశంలో గూగుల్ శోధన పరిష్కారం ఇచ్చింది. ``గూగుల్ లో సెర్చ్ చేయండి!`` అంటూ అతడు అధికారులకు చెప్పడంతో ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు నీల్ నితిన్ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోగలిగారు. నీల్ నితిన్ తాతగారు ముఖేష్ , తండ్రి నితిన్ ముఖేష్ ఇద్దరూ భారతీయ సినీపరిశ్రమలో పాపులర్ గాయకులు. నీల్ నితిన్ గానంలో కాకుండా నటనలో ప్రవేశించి రాణిస్తున్నాడు.