టికెట్ల రేట్లపై కామెంట్.. నెగెటివిటీ పీక్స్
ఇప్పుడున్న టికెట్ల రేట్లు ఎలా రీజనబులో కొంచెం అణకువతో చెప్పాల్సింది. కానీ నాగవంశీ వేరే టోన్లో ఆ మాటలు చెప్పారు.
సినిమాల ఫలితాలను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి ఇప్పుడు. ఆయా చిత్రాల్లో భాగమైన వారి ప్రవర్తన, మాట తీరును కూడా పరిగణనలోకి తీసుకుని జనం థియేటర్లకు వెళ్లే రోజులు వచ్చేశాయి. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, అహంకారం ప్రదర్శించినా.. వాళ్లు భాగమైన సినిమాల మీద సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగిపోతోంది. సినిమాకు కొంచెం నెగెటివ్ టాక్ వస్తే చాలు.. అది మల్టిప్లై అయ్యేలాగా ప్రతికూల ప్రచారాలు నడుస్తున్నాయి.
ఆ మధ్య రిలీజైన ఓ సినిమా అనుకున్న దాని కంటే దారుణమైన ఫలితాన్నందుకోవడానికి.. దాని దర్శకుడు విడుదల ముంగిట మీడియా ఇంటర్వ్యూల్లో చూపించిన యాటిట్యూడ్ ఓ కారణమనే చర్చ జరిగింది. లేటెస్ట్‌గా 'కంగువ' సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా తమ చిత్రం 2 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందనడం, వేట్టయన్ మూవీ మీద పరోక్షంగా కౌంటర్లు వేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. నెటిజన్లు ఇలా చేయడం తప్పయినా.. పరిస్థితులు సున్నితంగా మారిపోయిన నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు వారి చిత్రాల మీద అనవసర నెగెటివిటీని పెంచుతున్న మాట వాస్తవం.
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల గురించి సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఫ్యామిలీ కలిసి సినిమా చూడ్డానికి 1500 పెట్టలేరా అంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారి తీశాయి. 'ఎక్స్' అనే కాక ఫేస్ బుక్, ఇన్‌స్టాలో కూడా నాగవంశీ వ్యాఖ్యల మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. నాగవంశీ తీరును తప్పుబడుతూ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయన అహంకార ధోరణిని తప్పుబడుతున్నారు. మీ సినిమాలు చూడం అని వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని ధరలూ పెరిగిన విషయాన్ని గుర్తు చూస్తూ.. ఇప్పుడున్న టికెట్ల రేట్లు ఎలా రీజనబులో కొంచెం అణకువతో చెప్పాల్సింది. కానీ నాగవంశీ వేరే టోన్లో ఆ మాటలు చెప్పారు. ప్రేక్షకుల పట్ల గౌరవం లేనట్లు.. వాళ్లను నిలదీస్తున్నట్లు మాట్లాడారు. నాగవంశీ మాట తీరుపై ముందు నుంచి అభ్యంతరాలున్నాయి.
ఆయనకు విపరీతమైన యాటిట్యూడ్ అనే చర్చ సోషల్ మీడియాలో తరచుగా జరుగుతుంటుంది. నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పడం ఓకే కానీ.. ఆ మాటల్లో అణకువగా ఉండాలి. అహంకారంతో మాట్లాడినట్లు అనిపించకూడదు. సోషల్ మీడియా దుష్పరిణామాలు రోజు రోజుకూ తీవ్రమైపోయి సినిమాల పట్ల అనవసర నెగెటివిటీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆచితూచి మాట్లాడ్డం చాలా అవసరమనడానికి ఈ ఉదంతం తాజా ఉదాహరణ.