అకీరా ఇంకా చిన్నోడు.. ఆ విషయం తెలియదు!

మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అకీరా నందన్‌ సినిమా రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు.

Update: 2024-09-11 09:44 GMT

మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అకీరా నందన్‌ సినిమా రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల అకీరా ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. అకీరా ఎంట్రీ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ పదే పదే సోషల్‌ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు. ఆ మధ్య అకీరా మార్షల్ ఆర్ట్స్ తో పాటు, యాక్టింగ్‌ లో శిక్షణ తీసుకుంటున్నట్లుగా మెగా ఫ్యామిలీ నుంచి సమాచారం అందింది. అకీరా ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉండటంతో పాటు, హీరో గా చూడ్డానికి చక్కగా అన్నయ్య వరుణ్‌ తేజ్ మాదిరిగా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే మెగా కాంపౌండ్‌ మాత్రం ఇప్పట్లో అకీరా ఎంట్రీ ఉండదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ్ముడు అకీరా సినీరంగ ప్రవేశం గురించి మాట్లాడింది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రేక్షకులకు, ఇండస్ట్రీ లో సినిమాకు సహకరించిన వారికి, మెగా ఫ్యామిలీ మెంబర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసింది.

అదే ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ... అకీరా సినిమాల గురించి అప్పుడే చర్చ జరగడం ఆశ్చర్యంగా ఉంది. అకీరా ఇంకా చాలా చిన్నవాడు. అతనికి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా? లేదా? అనే విషయం నాకు తెలియదు. కానీ అందరి మాదిరిగానే అకీరా కెరీర్ బాగుండాలని నేను కోరుకుంటాను అంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు అడుగు పెట్టినా కష్టపడి పని చేస్తే తప్పకుండా మంచి విజయాలు దక్కుతాయని నిహారిక చెప్పుకొచ్చింది. అకీరా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అంతా కోరుకుంటున్నా, ప్రస్తుతానికి అది జరగదని ఆమె మాటలను బట్టి అర్థం అవుతోంది.

పవన్ కళ్యాణ్‌ ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది కాలంగా పవన్‌ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసిన పవన్‌ కళ్యాణ్ ఆ తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి అవ్వడంతో పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఈ నెలలో లేదా వచ్చే నెలలో షూటింగ్‌ కు పవన్ హాజరు అయ్యి ఓజీ ని పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చాడు. కానీ ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పవన్ షూటింగ్‌ కి మళ్లీ వాయిదా పడింది. పవన్‌ రాజకీయాలతో బిజీ అయిన కారణంగా ఆయన వారసుడిగా అకీరా ఇండస్ట్రీలో అడుగు పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News