పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటనపై నిహారిక ఏమన్నదంటే!
ఆమె బాబు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలు అయ్యాడు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో వివాహిత రేవతి మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె బాబు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలు అయ్యాడు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవలే హీరో అల్లు అర్జున్ వెళ్లి స్వయంగా శ్రీతేజ్‌ని పరామర్శించి వచ్చాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా మెగా డాటర్ నిహారిక స్పందించింది. తన మద్రాస్ కారన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ విషయమై మాట్లాడింది.
నిహారిక తమిళ్ మూవీ 'మద్రాస్ కారన్' విడుదలకు సిద్ధం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు మీడియా సమావేశాల్లో నిహారిక మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మద్రాస్ కారన్ సినిమా విశేషాలు పంచుకున్నారు. అదే సమయంలో తన ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన ఘటనపైనా ఆమె మాట్లాడారు. ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ ఆ విషాదం నుంచి బయటకు వస్తున్నాడని నిహారిక పేర్కొంది. తీవ్రమైన ఆందోళనతో అల్లు అర్జున్ ఉన్నాడని ఆమె నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
నిహారిక ఇంకా మాట్లాడుతూ... చెడు జరగాలని ఏ ఒక్కరూ కోరుకోరు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన కచ్చితంగా దురదృష్టకరం. ఒకరి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. బతకడానికే మనం పని చేస్తూ ఉంటాం. అలాంటి ప్రాణాలకే ప్రమాదం రావడం దురదృష్టకరం. ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటాను. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఆయన పూర్తిగా మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నాను. సంఘటన అల్లు అర్జున్‌కి మానసిక వేదన కలిగించిందని, ఆయన కుటుంబానికి ఇబ్బంది కలిగించింది అని నిహారిక పేర్కొంది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వివాదం ఒక వైపు నడుస్తూ ఉంటే మరో వైపు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. దంగల్ సినిమా వసూళ్లను బ్రేక్ చేయడం కోసం పుష్ప 2 జర్నీ కొనసాగుతోంది. తాజాగా మరో 20 నిమిషాల సినిమాను అదనంగా చేర్చడం జరిగింది. పుష్ప రీ లోడెడ్ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడంతో ఆ 20 నిమిషాలు ఏం ఉంది అంటూ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ దెబ్బతో పుష్ప 2 సినిమా రూ. 2000 కోట్లకు వసూళ్లు చేరడం కన్ఫర్మ్ అంటున్నారు. దంగల్ రికార్డ్‌ని బ్రేక్ చేయాలి అంటే రూ.2075 కోట్ల వసూళ్లను పుష్ప 2 రాబట్టాల్సి ఉంది.