రణబీర్- రణవీర్.. నీతా అంబానీ ఫేవరెట్ ఎవరు?
ఈ సమావేశంలో ఒక రాపిడ్ ఫైర్ చర్చ నుండి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా షేర్ అవుతోంది.
ప్రపంచ వేదికపై భారతీయతను విస్తరించాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసేవారిలో కుభేరుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. నీతా అంబానీ ఇటీవల హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు. అక్కడ కీలకోపన్యాసం చేసి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియాతో సంభాషణలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక రాపిడ్ ఫైర్ చర్చ నుండి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా షేర్ అవుతోంది. ఈ వీడియోలో నీతాజీ ఆకాంక్ష అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. విద్య, క్రీడలు, సంస్కృతి, దాతృత్వం, సాంకేతికత వంటి రంగాలలో భారతదేశంలో వృద్ధి ప్రపంచ ఖ్యాతిని నీతా అంబానీ హైలైట్ చేశారు. యువ నాయకులు, భారతదేశంలోని యువతరం పెద్ద కలలు కనాలని, ప్రపంచ వేదికపై భారతదేశ భవిష్యత్తును రూపొందించాలని ప్రోత్సహించారు.
హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో తన కీలకోపన్యాసం చేయడానికి ముందు నీతాజీ తన 90 ఏళ్ల తల్లి ఆర్థిక స్థోమత గురించి ప్రస్థావించారు. తన చిన్నతనంలో విదేశాలకు పంపే స్తోమత లేనప్పటికీ హార్వర్డ్ తనను మాట్లాడటానికి ఆహ్వానించినందుకు ఎలా భావోద్వేగానికి గురైందో, దానిని ఎంత గర్వంగా ఫీలైందో వివరించింది. ఇదే కార్యక్రమంలో బాలీవుడ్ గురించి నీతాజీ ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. హాలీవుడ్ , బాలీవుడ్ లలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరగా, ఆమె రెండోదాన్ని ఎంచుకుంది. హిందీ సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్ అని నీతా అంబానీ వెల్లడించారు.
రణ్ వీర్, రణబీర్ లలో ఎవరో ఒకరిని ఎంచుకోమని అడిగినప్పుడు, ఆమె రణ్‌బీర్ కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు.``రణ్‌బీర్, ఎందుకంటే నా కొడుకు ఆకాష్ చాలా సంతోషంగా ఉంటాడు. అతడు ఆకాష్ కి ప్రాణ స్నేహితుడు` అని చెప్పారు. రణ్‌బీర్ కపూర్ లేదా బిల్ గేట్స్ తో మీరు ఎవరితో డిన్నర్ చేయడానికి ఇష్టపడతారు? అని ప్రశ్నించగా, నీతాజీ నిరభ్యంతరంగా బాలీవుడ్ నటుడు రణబీర్‌ని ఎంచుకుంది. ఇది వీక్షకులను ఉత్సాహపరిచింది.
నిజానికి రణబీర్, ఆకాష్ అంబానీ మంచి స్నేహితులు. తరచుగా వేడుకల్లో కలిసి కనిపిస్తారు. రణ్‌బీర్ -ఆలియా భట్ జంట పెళ్లికి ఆకాష్ అంబానీ హాజరయ్యారు. వారి స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తూ అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ , వెడ్డింగ్ వేడుకలలో ఆకాష్ తోనే రణబీర్ కుటుంబం కనిపించింది. ఈ వేడుకలో బాలీవుడ్ కపుల్స్ డ్యాన్సులు చేసిన సంగతి తెలిసిందే.