అదిదా నాకు తెలియదంటే ఎలా బాసూ..!

తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నితిన్‌కు పాట వివాదం గురించిన ప్రశ్న ఎదురైంది.;

Update: 2025-03-23 09:00 GMT

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'రాబిన్‌హుడ్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన అదిదా సర్‌ప్రైజ్ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. ఆ మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్‌కి ఎలాంటి విమర్శలు వచ్చాయో అదే తరహా వివాదం ఈ పాట ఎదుర్కొంటుంది. మహిళలను తక్కువ చేసి చూపించే విధంగా పాట ఉందని, అందులోని డాన్స్‌ మూమెంట్స్ ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆచితూచి వివాదంపై స్పందిస్తున్నారు.

తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నితిన్‌కు పాట వివాదం గురించిన ప్రశ్న ఎదురైంది. అదిదా సర్‌ప్రైజ్‌లోని హీరోయిన్‌ డాన్స్‌ మూమెంట్స్‌ వివాదంపై స్పందించాల్సిందిగా కోరిన సమయంలో చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. నితిన్‌ స్పందిస్తూ... అదిదా సర్‌ప్రైజ్ పాట చిత్రీకరన సమయంలో నేను లేను. ఆ పాట షూటింగ్‌ జరుగుతున్నపుడూ నేను చూడలేదు. పాట విడుదలైన తర్వాత పాజిటివ్‌ కామెంట్స్‌తో పాటు నెగటివ్‌ కామెంట్స్ వచ్చాయి. ఆ సమయంలో నేను రెండు అభిప్రాయాలను గౌరవించాము. సినిమా చూసిన సమయంలోనూ తాను డాన్స్ మూమెంట్స్ గురించి ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చల కారణంగా వివాదం అర్థం అయింది.

ప్రతి పాటకు, సన్నివేశానికి రెండు రకాల స్పందనలు వస్తాయి. ఈ పాటకు కూడా అలాంటి స్పందనలు వచ్చాయని నేను భావించాను. అయితే ట్రోల్స్ ఎక్కువగా రావడం చూసిన తర్వాత పరిస్థితి అర్థం అయిందని చెప్పుకొచ్చాడు. ముందు ముందు ఎలాంటి వివాదం లేకుండా సినిమా సాఫీగా ముందుకు సాగుతుందని, విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశిస్తున్నాను అని నితిన్ చెప్పుకొచ్చాడు. డాన్స్‌ మూమెంట్స్ గురించి నాకు తెలియదు, షూటింగ్‌ సమయంలో నేను లేను అంటూ నితిన్‌ వ్యాఖ్యలు చేయడంను చాలా మంది విమర్శిస్తున్నారు. తన సినిమా విషయంలో వస్తున్న వివాదం విషయంలో ఇలాగేనా స్పందించేది అంటూ పలువురు నితిన్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పాట చిత్రీకరణ సమయంలో ఆయన ఉన్నా లేకున్నా హీరోగా మినిమం బాధ్యత అనేది ఉంటుంది కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ ఈ పాటలోని డాన్స్ మూమెంట్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ముందు ముందు అయినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ సూచించింది. రాబిన్‌హుడ్‌ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించగా అదిదా సర్‌ప్రైజ్ పాటలో కేతిక శర్మ నటించిన విషయం తెల్సిందే. కేతిక డాన్స్‌ మూమెంట్స్ మాత్రమే కాకుండా మల్లెపూల ఔట్‌ ఫిట్‌ సైతం వివాదాస్పదం అయింది. ఈ వివాదాస్పద పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. దబిడి దిబిడికి కూడా ఈయనే కొరియోగ్రఫీ అందించిన విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో శేఖర్‌ మాస్టర్ వర్క్‌ స్టైల్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News