రాబిన్ హుడ్.. చివరి నిమిషంలో తొలిగించేసి..
యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ రాబిన్ హుడ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ రాబిన్ హుడ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, టీజర్, సాంగ్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ హైలైట్‌గా నిలిచింది. కొన్ని కామెడీ సీన్స్ తో అయితే సినిమా బెటర్ అనిపించిందనేలా టాక్ వినిపిస్తోంది. ఇక ఆడియెన్స్ సినిమాను ఎలా రిసివ్ చేసుకుంటారు అనేది కలెక్షన్స్ ను బట్టి అర్ధమవుతుంది.
అయితే సినిమా విడుదలకు ముందే వైరల్ అయిన అంశం 'అదిదా సర్‌ప్రైజు' పాట. కేతికా శర్మ స్పెషల్ సాంగ్‌గా వచ్చిన ఈ పాట లిరికల్ వీడియోలో గ్లామర్, డ్యాన్స్ మూమెంట్స్ పెద్ద చర్చకెక్కాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పాటలోని కొన్ని హుక్ స్టెప్పులు అసభ్యంగా ఉన్నాయనే అభిప్రాయంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మహిళా సంఘాలు, సోషల్ మీడియా వేదికలపై నెగటివ్ కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో సినిమా విడుదలకు ముందు ఈ పాటపైనే చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ వివాదాస్పద హుక్ స్టెప్పులను భారతీయ థియేటర్లలో ప్రదర్శించే వెర్షన్ నుంచి మేకర్స్ తొలగించినట్లు తెలుస్తోంది. కానీ ఓవర్సీస్ వెర్షన్‌లో మాత్రం అవే స్టెప్పులు అలాగే కొనసాగుతున్నాయట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో కేతికా శర్మ చేసిన స్టెప్పులు సినిమాకు హైప్ తీసుకొచ్చినా, అదే విషయంలో ఇలా వివాదం రావడం మేకర్స్‌ను చివరిమినిట్లో కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. ఇది చర్చనీయాంశమవుతోంది.
ఈ వివాదంతో సినిమా టాక్‌కి పెద్దగా ఎఫెక్ట్ పడకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అది హాట్ టాపిక్ అయింది. అభిమానులు ఒకవైపు మేకర్స్‌ను బాధ్యతగా వ్యవహరించారని ప్రశంసిస్తుంటే, మరోవైపు ‘ఓవర్సీస్‌లో ఎందుకు ట్రిమ్ చేయలేదు?’ అంటూ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఉండడం సహజమేనని భావించినా, హద్దులు దాటి అశ్లీలంగా అనిపించే కంటెంట్ ఉంటే విమర్శలు తప్పవని పరిశ్రమలో విశ్లేషణ సాగుతోంది.
ఇదే సందర్భంలో గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లోని పాటల విషయంలోనూ ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. బాలకృష్ణ నటించిన డాకు మహారాజా లోని ఓ పాట స్టెప్‌ను విమర్శల నేపథ్యంలో తొలగించిన విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. రాబిన్ హుడ్ విషయంలోనూ మేకర్స్ అదే జాగ్రత్త తీసుకుని చివర్లో ఆ సన్నివేశాన్ని రిమూవ్ చేయడం విశేషం. సినిమా మొత్తంగా ఓ మాస్ కాంబో ఎంటర్టైనర్‌గా నిలుస్తుందా? లేక వివాదాల ప్రభావం ఎక్కువగా ఉంటుందా అన్నది వసూళ్ల ఆధారంగా తేలనుంది.
మొత్తానికి, రాబిన్ హుడ్ విడుదలకు ముందు చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతానికి సరైనదే అనిపిస్తోంది. కానీ భవిష్యత్‌లో దర్శకులు, కొరియోగ్రాఫర్లు డాన్స్ మూమెంట్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పాటలు వైరల్ కావడం ఒక్కటే కాదు.. అవి ఎలాంటి ప్రెజెంటేషన్‌తో ఉంటున్నాయన్నదీ కీలకం.