ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలన్న కేంద్ర మంత్రి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. గత ఏడాది కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కంగనా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకు ముందు సినిమా విడుదలకు సెన్సార్ సమస్యలు అడ్డుగా నిలిచాయి. ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయట పడ్డ ఎమర్జెన్సీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులు కళ్లకు కట్టినట్టు చూపించే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రీమియర్ వేసి చూపించారు. నాగపూర్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోను చూసిన నితిన్ గడ్కారి చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. దేశ చరిత్రలో చీకటి రోజులను ప్రతి ఒక్కరికీ చూపించేందుకు ఈ సినిమాను తీసుకు రావడం అభినందనీయం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలి అంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చక్కగా రూపొందించారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులను మంత్రి కొనియాడారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కంగనా రనౌత్‌పై నితిన్ గడ్కారి ప్రశంసలు కురిపించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేయడం కోసం కంగనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాస్పద సినిమాలకు మంచి స్పందన దక్కుతుంది. ఇప్పటికే వివాదాల వల్ల సినిమాకు చాలా పబ్లిసిటీ దక్కింది. అప్పటి పరిస్థితులను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా కంగనా రనౌత్‌కి మద్దతు తెలుపుతున్న వారు చాలా మంది ఉన్నారు.
ఇక కొందరు మాత్రం ఎమర్జెన్సీకి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన విషయాలను తప్పుదోవ పట్టిస్తూ ఈ సినిమాను రూపొందించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో గొప్ప నేతల్లో ఇందిరా గాంధీ ఒకరు. ఆమె ప్రతిష్టను దెబ్బ తీసే కుట్ర జరుగుతోంది అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఎమర్జెన్సీ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు సినిమాలో ఎం ఉంటుంది అనే ఆసక్తి సగటు ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తూ వస్తున్న కంగనాకు ఈ సినిమా ఏ మేరకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుంది అనేది చూడాలి.