అత్యాచారం చేశానని నిరూపించమనండి.. హీరో ఛాలెంజ్!
తనపై వచ్చిన తప్పుడు అత్యాచార ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మలయాళ నటుడు నివిన్ పౌలీ అధికారికంగా ఫిర్యాదు చేశారు.
తనపై వచ్చిన తప్పుడు అత్యాచార ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మలయాళ నటుడు నివిన్ పౌలీ అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన దుబాయ్‌లో జరిగిందని పేర్కొన్న ఒక మహిళ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించడంతో నివిన్ చట్టపరమైన చర్య తీసుకున్నాడు. అతడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఫిర్యాదు వెనుక ఏదైనా కుట్ర ఉంటే దానిని వెలికితీయాలని అధికారులను కోరారు.
తాను దోషి అయితే ఆధారాలు సమర్పించాలని నివిన్ పౌలీ డిమాండ్ చేశారు. కేరళలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కి నివిన్ పౌలీ అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను దుబాయ్‌లో లేనని నిరూపించేందుకు తన పాస్‌పోర్ట్ సహా సవివరమైన ఆధారాలను ఫిర్యాదులో అందించాడు. నేరం జరిగిందని ఫిర్యాదుదారు ఆరోపించినప్పుడు అతడు కేరళలో ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు. విచారణను వేగవంతం చేసి కేసు నుండి తన పేరును తొలగించాలని నివిన్ పౌళి పోలీసులను అభ్యర్థించాడు.
ఆ సమయంలో విదేశాలకు వెళ్లలేదని ధృవీకరించడానికి తన పాస్‌పోర్ట్ కాపీలను కూడా ఫిర్యాదునకు నివిన్ జత చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా హామీ ఇచ్చారు. అత్యవసర విలేకరుల సమావేశంలో నివిన్ పౌలీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తాజా డెవలప్ మెంట్ ఇది. తాను నిర్ధోషిని అని పునరుద్ఘాటించాడు. ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
నివిన్ సహా ఆరుగురు వ్యక్తులు ఒక చిత్రంలో పాత్రను ఆఫర్ చేస్తామనే నెపంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు ఆరోపించారు. గతేడాది నవంబర్‌లో దుబాయ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో మలయాళ సినీ నిర్మాత ఎకె సునీల్‌ను రెండో నిందితుడిగా పేర్కొనగా, నివిన్‌ను ఆరో నిందితుడిగా చేర్చారు.
తొలుత ఊన్నుకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు.