'పుష్ప 2' ఎఫెక్ట్.. దిల్ రాజు 'గేమ్' ప్లాన్ ఎలా ఉంటుందో?

ఈ ఘనటను సీరియస్ గా తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2024-12-06 10:33 GMT

పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో బెనిఫిట్‌ షోలు, మిడ్‌ నైట్‌ షోలు, ఎర్లీ మార్నింగ్‌ షోలు అంటూ టాలీవుడ్ లో సందడి కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, కూకట్‌పల్లి ఏరియాలలో ఎక్కువగా స్పెషల్ షోలు వేస్తుంటారు. ఇప్పుడు ''పుష్ప 2'' చిత్రానికి అందనలు షోలు వేసుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో, ఒక రోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేశారు. ఇందులో భాగంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘనటను సీరియస్ గా తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో త్వరలో విడుదల కాబోయే పెద్ద సినిమాల పరిస్థితి ఏంటనేది టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈరోజుల్లో భారీ బడ్జెట్ చిత్రాల ఓపెనింగ్స్ కి స్పెషల్ షోలు చాలా కీలకం. ఈ మధ్య కాలంలో మేకర్స్ బెనిఫిట్ షోల ద్వారా మంచి రెవెన్యూ రాబడుతున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు ఓపెనింగ్ డే రికార్డ్‌లు సృష్టించాలి అంటే ప్రీమియర్‌లు, బెనిఫిట్‌ షోలు, ఎర్లీ మార్నింగ్‌ షోలు ఉండాలి. కానీ ఇకపై వాటికి నైజాంలో అనుమతులు ఇవ్వకపోతే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

'పుష్ప 2: ది రూల్' తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే పెద్ద సినిమా ''గేమ్ ఛేంజర్''. రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. దీంతో పాటుగా బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు కూడా రెండేసి రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలతోనూ దిల్ రాజు సంబంధం కలిగి ఉన్నారు. రెండు ఆయన సొంత ప్రొడక్షన్ లో రూపొందే సినిమాలైతే, మరొకటి ఆయన డిస్ట్రిబ్యూషన్ లో రిలీజ్ కాబోతున్న సినిమా. కాబట్టి ఆయనకు ఈ సంక్రాంతి చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ రాకపోతే అగ్ర నిర్మాత ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి రాబోతున్న మైలురాయి 50వ సినిమా 'గేమ్ చేంజర్'. అందుకే దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా నిర్మించారు. డైరెక్టర్ శంకర్ ఎంత చెబితే అంత ఖర్చు చేసారు. ఇప్పుడు పెట్టుబడులు వెనక్కి రాబట్టుకోవాలంటే, టికెట్ హైక్స్ తో పాటుగా స్పెషల్ షోలు కూడా అవసరం అవుతాయి. ఇప్పుడేమో తెలంగాణాలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని మంత్రి చెబుతున్నారు. అందుకే 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోల సంగతేంటి? నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా అయిన దిల్ రాజు ఏం ప్లాన్ చేస్తారు? అనేదే ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో దిల్ రాజుకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందులోనూ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనకు చాలా క్లోజ్. కాబట్టి ఏదైనా చెయ్యగలిగితే ఆయనే చెయ్యాలి. ఒకవేళ 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలకు అనుమతి తెచ్చుకుంటే, ఇకపై రాబోయే అన్ని పెద్ద సినిమాలకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే గానీ జరిగితే సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటన, ప్రస్తుతానికి ప్రజలను కూల్ చెయ్యడానికి ఇచ్చిన స్టేట్మెంట్ అనుకోవాలి. అయితే ఒకసారి థియేటర్ వద్ద అలాంటి దుర్ఘనటనలు జరిగాయని ప్రతీ సినిమాకీ అలానే జరుగుతుందని అనుకోవడం సరికాదు. అందుకే పూర్తిగా బెనిఫిట్ షోలను బ్యాన్ చెయ్యకుండా, తగినన్ని జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News