ఎన్టీఆర్ కెరీర్ బ్లాక్ బస్టర్‌కు బీజం పడింది అక్కడే!
`ఆది` వెనకున్న ఆసక్తికరమైన విషయాల్ని ఇటీవల `విశ్వంభర` దర్శకుడు మల్లిడి వశిష్ట తండ్రి, నిర్మాత మల్లిడి సత్యనారాయణ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.;

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆది`. వి.వి.వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం తెలిసిందే. 2002లో విడుదలైన ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని దక్కించుకుని ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హీరోగా ఎన్టీఆర్‌ని పాపులర్ చేసి మాస్ హీరోగా నిలబెట్టింది.
అప్పట్లో ఈ మూవీని కేవలం రూ.2 కోట్లతో నిర్మిస్తే ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ఎన్టీఆర్ సత్తా ఏంటో ట్రేడ్ వర్గాలకు, నిర్మాతలకు తెలియజేసింది. రూ. 2 కోట్లతో నిర్మిస్తే ఈ సినిమా రూ.18 కోట్లు రాబట్టింది. 121 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా 96 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కెరీర్‌లో తిరుగులేని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు వీవీ వినాయక్ కెరీర్‌ని మార్చిన ఈ సినిమా వెనక పెద్ద స్టోరీ ఉంది.
`ఆది` వెనకున్న ఆసక్తికరమైన విషయాల్ని ఇటీవల `విశ్వంభర` దర్శకుడు మల్లిడి వశిష్ట తండ్రి, నిర్మాత మల్లిడి సత్యనారాయణ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ` వడ్డే నవీన్ హీరోగా చంద్రమహేష్ రూపొందించిన `చెప్పాలని ఉంది` సినిమాకు వీవీ వినాయక్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా పాటల కోసం ఔట్‌డోర్ వెళ్లారు. అదే సమయంలో ఎన్టీఆర్ `సుబ్బు` సినిమా పాటల చిత్రీకరణ కోసం అక్కడికి వచ్చారు.
అక్కడ వినాయక్, ఎన్టీఆర్ ఒకే హోటల్‌లో దిగారు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదే సమయంలో తాను త్వరలో డైరెక్టర్‌ని కాబోతున్నానని చెప్పాడు. ఎవరన్నా హీరో అని ఎన్టీఆర్ అడగడంతో ఆకాష్ హీరో అని, బెల్లంకొండ సురేష్ నిర్మాత అని వినాయక్ చెప్పాడు. ఆ మాటలు విన్న ఎన్టీఆర్ ఆ కథేదో నాకు చెప్పు నచ్చితే నేనే చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. దానికి వినాయక్ `సరే అయితే హైదరాబాద్ వెళ్లాక కథ చెబుతానని` చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్‌కు అనుకున్నట్టే కథ చెప్పడం, అది ఆయనకు బాగా నచ్చడంతో అదే `ఆది` అయింది. అంటూ `ఆది`కి బీజం ఎక్కడపడిందో వెల్లడించారు మల్లిడి సత్యనారాయణ.