బావ‌మ‌రిదికి ఎన్టీఆర్ స‌పోర్ట్ లేదా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ నార్నే శ్రీ‌నివాస‌రావు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-05 04:06 GMT
NTR On Narnne Nithin’s Entry into Films

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ నార్నే శ్రీ‌నివాస‌రావు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత ఎన్టీఆర్ కెరీర్ ప‌రంగా చాలా దూరం ప్ర‌యాణించారు. ఇప్పుడు పాన్ ఇండియ‌న్ స్టార్ గా ఎదిగారు. ఆస‌క్తిక‌రంగా త‌న భార్య కుటుంబం నుంచి ఒక న‌టుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఎన్టీఆర్ బావ‌మ‌రిది, ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి సోద‌రుడు నార్నే నితిన్ టాలీవుడ్ లో న‌టుడిగా ఆరంగేట్రం చేసి, నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. అత‌డు `మ్యాడ్` సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెసైంది. ఆ త‌ర్వాత ఆయ్ సినిమాతో మ‌రో విజ‌యం సాధించాడు. ఇప్పుడు MAD స్క్వేర్ కూడా విజయవంతం కావ‌డంతో హ్యాట్రిక్‌ని ఆస్వాధిస్తున్నాడు.

అయితే బావ‌మ‌రిది నితిన్ సినీఇండ‌స్ట్రీలో ఎద‌గ‌డానికి ఎన్టీఆర్ కార‌ణ‌మా? అంటే దానికి మ్యాడ్ స్క్వేర్ స‌క్సెస్ వేదిక‌పై అత‌డు స్వ‌యంగా స‌మాధాన‌మిచ్చారు. నేను యాక్ట‌ర్ ని అవుతాన‌ని అత‌డు ధైర్యంగా చెబితే..నా స‌పోర్ట్ ఉండ‌దు పోయి సావు అన్నాను! అని ఎన్టీఆర్ అన్నారు. నిజానికి అత‌డు నాతో మాట్లాడేందుకు భ‌య‌ప‌డి దాక్కునేవాడ‌ని ఎన్టీఆర్ తెలిపారు. ధైర్యం తెచ్చుకుని న‌న్ను అడిగిన ఒకే ఒక్క మాట నేను యాక్ట‌ర్ ని అవుతాన‌ని.. అప్పుడు నేను అలా అన్నాను. కానీ ఆ త‌ర్వాత అత‌డు ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా ఎలా ముందుకు సాగుతాడో అంటూ ఆలోచించేవాడిని అని కూడా ఎన్టీఆర్ అన్నారు. తాను ఒక్క స‌ల‌హా కూడా ఇవ్వ‌కుండానే, త‌న‌కు తానుగా ముందుకు సాగాడ‌ని కూడా తెలిపారు తార‌క్.

ఎన్టీఆర్ మాట్లాడుతూ-``నేను 2011లో వివాహం చేసుకున్నాను. ఆ సమయంలో నితిన్ చిన్న పిల్లవాడు. అతడు నాతో మాట్లాడటానికి చాలా భయపడేవాడు. నేను ఇంట్లోకి ప్రవేశిస్తే త‌ను వేరొక గ‌దిలోకి వెళ్ళిపోయేవాడు. నేను ఎప్పుడూ అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడిని. అత‌డు ఒక‌రోజు ధైర్యం చేసుకుని చెప్పిన ఒకే ఒక్క మాట `బావా నేను యాక్ట‌ర్ అవుతాను` అని.. అంతే ధైర్యంగా నేను కూడా `నా స‌పోర్ట్ ఉండ‌దు పోయి సావు` అన్నాను`` అని జూనియర్ ఎన్టీఆర్ స‌ర‌దా ప‌రిహాసంగా అన్నారు.

కానీ అత‌డి న‌ట‌నా జీవితం ఎలా ఉంటుందోన‌ని ఆందోళ‌న చెందాను. ఎవ‌రికి వారు సొంత మార్గాన్ని అనుస‌రించాలి. స్వేచ్ఛను ఇవ్వాలి. ఎవరూ వేరొకరి నీడలో జీవించకూడదని నేను నితిన్‌తో చెప్పాను. కానీ అతడు త‌న‌కు తానుగానే సాధించుకుంటున్నాడు. అతడు ఎప్పుడూ నన్ను సహాయం అడగలేదు. ఈ రోజు ఇలా ఉన్నాడు. అతడు మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేసినందున ఇప్పటివరకు ఈ ప్రయాణం సాధ్యమైంది. అతనికి ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇలాగే ఒదిగి ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అని ఎన్టీఆర్ వివరించారు. మ్యాడ్‌ స్క్వేర్ లో నార్నే నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు త‌దిత‌రులు క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం స్నేహితుల బృందం గ్రాండ్ స‌క్సెస్ ని ఆస్వాధిస్తోంది.

Tags:    

Similar News