డ్రాగన్... ముందుగానే ఎన్టీఆర్!
ఎన్టీఆర్ ఈ నెలలో పాల్గొనబోతున్న షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయబోతున్నారు.;
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ లేని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఒక ఫోటోను సైతం విడుదల చేశారు. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త షెడ్యూల్‌కి ప్లాన్ చేస్తున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలోనే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. మొదట ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి షూటింగ్ కి హాజరు కావాల్సి ఉంది. కానీ వార్ 2 సినిమా పాట చిత్రీకరణ మధ్యలో నిలిచి పోవడంతో ఎన్టీఆర్ కి ముందుగానే సమయం లభించిందట.
వార్ 2 సినిమా పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ రోషన్ ప్రమాదానికి గురి అయ్యాడు. ఆయన నిల్చోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన డాన్స్ చేసే పరిస్థితి లేదు. దాంతో కనీసం నెల రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఆ కారణంగానే డ్రాగన్ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముందుగానే డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతూ వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సైతం సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
ఎన్టీఆర్ ఈ నెలలో పాల్గొనబోతున్న షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయబోతున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ పై సోలో సాంగ్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఒకే షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, సోలో సాంగ్‌ను షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఏప్రిల్ రెండవ వారం లేదా మూడో వారం వరకు కొనసాగుతుందని తెలుస్తోంది.
ఆ తర్వాత తిరిగి వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎన్టీఆర్ రెండు సినిమాలను సమాంతరంగా చేస్తున్నట్లు అవుతుంది. ఈమధ్య కాలంలో ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న హీరోలు తక్కువ మంది ఉన్నారు. ప్రభాస్ మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.
డ్రాగన్ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అంటే కచ్చితంగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. అయినా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం సాధ్యమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రతిసారి తన సినిమాను అనుకున్న డేట్‌కి కాకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.
కనుక ఈ సినిమాను సైతం ఆయన వాయిదా వేస్తారని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేస్తే కచ్చితంగా ఫ్యాన్స్‌కి పండగే అనడంలో సందేహం లేదు.