మార్క్ శంకర్ కోసం ఎన్టీఆర్ ప్రార్థనలు
మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంకు గురి అయిన విషయమై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించారు.;

ఏపీ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదంకు గురి అయిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ తనయుడి ఆరోగ్య పరిస్థితి విషయమై రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడి మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు సైతం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్‌కి వెళ్లారు.
మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంకు గురి అయిన విషయమై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఎన్టీఆర్ స్పందిస్తూ... సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న యోధుడు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం దక్కాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే ప్రారంభం అయిన డ్రాగన్ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ త్వరలోనే షూటింగ్‌కి జాయిన్ కాబోతున్నాడు అంటూ ప్రశాంత్ నీల్ సన్నిహితులు చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ను ప్రకటించబోతున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.
దేవర సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్ ఈ ఏడాది వార్ 2 తో రాబోతున్న విషయం తెల్సిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. త్వరలోనే ఎన్టీఆర్ దేవర 2 సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.