మొన్న బావమరిది కోసం... ఇప్పుడు అన్న కోసం ఎన్టీఆర్‌

మ్యాడ్‌ 2 సక్సెస్ మీట్‌లో సందడి చేసిన ఎన్టీఆర్‌ త్వరలోనే మరోసారి ఫ్యాన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.;

Update: 2025-04-08 05:22 GMT
మొన్న బావమరిది కోసం... ఇప్పుడు అన్న కోసం ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2'తో పాటు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. 'వార్‌ 2' షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇక ఇటీవలే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా ప్రారంభం అయింది. ఎన్టీఆర్‌ లేకుండా ఒక షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తి చేసిన నీల్‌ మరో షెడ్యూల్‌కి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్‌ సైతం ఈమధ్య కాలంలో నీల్‌ మూవీ కోసం బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ అప్పుడప్పుడు కనిపిస్తూ లేదా వినిపిస్తూ వస్తున్నారు. ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమాకు వాయిస్ ఓవర్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌ ఇటీవల బావమర్ది నటించిన 'మ్యాడ్‌ 2' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న విషయం తెల్సిందే.

మ్యాడ్‌ 2 సక్సెస్ మీట్‌లో సందడి చేసిన ఎన్టీఆర్‌ త్వరలోనే మరోసారి ఫ్యాన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ ఈ మధ్య కాలంలో తన అన్న నందమూరి కళ్యాణ్‌ ప్రతి సినిమాకు ఏదో ఒక విధంగా ప్రమోషన్‌లో భాగం అవుతున్న విషయం తెల్సిందే. అందులో భాగంగా ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌ 18న విడుదల కాబోతున్న అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 12న నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్‌ వీలును బట్టి ఆ డేట్‌ను ఫిక్స్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ హాజరు కన్ఫర్మ్‌.

అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్‌ తల్లి పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన తర్వాత విజయశాంతిని ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ కలిసినా ఆమె మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని, కానీ పోలీస్ ఆఫీసర్‌ వైజయంతి పాత్రకు విజయశాంతి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌, విజయశాంతి కాంబోలో ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల మొదలైన ప్రమోషన్ హడావుడితో సినిమా పై జనాల్లో ఇప్పటికే ఆసక్తి, అంచనాలు పెరిగాయి.

ఎన్టీఆర్‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు అయితే కచ్చితంగా అంచనాలు మరింత పెరగడం ఖాయం. మ్యాడ్‌ స్క్వేర్ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ కనిపించడం హైలైట్‌గా నిలవడం మాత్రమే కాకుండా సినిమా వసూళ్లు పెరగడంలో కీలక పాత్ర పోషించింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా ఓపెనింగ్స్‌లోనూ ఎన్టీఆర్‌ ప్రమోషన్‌ కీలక ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల వారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌తో పెరిగిన అంచనాలను మరింతగా పెంచే విధంగా సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌ ఉండబోతుందనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ హిట్ కొట్టి మళ్లీ చాలా కాలం అయింది. ఈ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్‌ కి హిట్ పడేనా చూడాలి.

Tags:    

Similar News