మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక్కడు కాంబినేషన్

గుణశేఖర్‌తో ఆమె మరోసారి కలిసి వర్క్ చేయడం అభిమానుల్లో ఆనందం కలిగించే అంశం.

Update: 2024-10-07 05:42 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం "ఒక్కడు". 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, భూమిక చావ్లా హీరోయిన్‌గా కనిపించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఆ తరువాత మహేష్ తో గుణశేఖర్ అర్జున్, సైనికుడు సినిమాలు చేయగా అవి అంతగా సక్సెస్ కాలేదు. ఇక భూమికతో మాత్రం ఈ దర్శకుడు మళ్ళీ వర్క్ చేయలేదు. అప్పటినుంచి వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

ఇప్పుడు, 20 ఏళ్ల తర్వాత వీరు మళ్లీ ఒకే ప్రాజెక్ట్ లో కలిసి పనిచేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పేరు "యూఫోరియా". గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక యువతరానికి సంబంధించిన సామాజిక డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ నేడు విడుదల కానుందని సమాచారం. భూమిక తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఈ మూవీ పోస్టర్‌ షేర్‌ చేయడంతో ఈ వార్త మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. సినిమాలో భూమిక చావ్లా ఏ పాత్రలో కనిపించబోతుందో అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఆమె చివరగా "బటర్‌ఫ్లై" చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఎమర్జెన్సీ" సినిమా విడుదల కోసం కూడా ఆమె ఎదురుచూస్తున్నారు. భూమిక గతంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, తన నటన అభినయంతో మంచి పేరు సంపాదించారు.

"ఖుషి", "ఒక్కడు", "సింహాద్రి" వంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. గుణశేఖర్‌తో ఆమె మరోసారి కలిసి వర్క్ చేయడం అభిమానుల్లో ఆనందం కలిగించే అంశం. ఈ సినిమా సామాజిక సమస్యలపై సాగే నేపథ్యంతో రూపొందుతుండటం కూడా ఆసక్తికరంగా మారింది. యూఫోరియా సినిమాలో ఆమె పాత్రకు గల ప్రాధాన్యత ఏమిటీ అన్నది టీజర్‌ విడుదల తర్వాత మరింత స్పష్టత వస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. గుణశేఖర్ దృష్టిలో ఈ సినిమా ఒక సరికొత్త కంటెంట్‌తో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసిన చిత్రాలు అన్ని ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మొత్తానికి, "యూఫోరియా" సినిమాతో మరోసారి గుణశేఖర్‌-భూమిక కాంబినేషన్ అభిమానులను థ్రిల్‌ చేయనుందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News