పాత టైటిళ్లతో కొత్త సినిమాలు!
పాత టైటిళ్లతో కొత్త సినిమాలను రిలీజ్ చేసి కొందరు మంచి హిట్లు అందుకోగా మరికొందరు ఫ్లాపులు, డిజాస్టర్లు చవి చూడటంతో పాటూ ఆ సినిమాలకు ఉన్న లెగసీని పోగొడుతున్నారు.;

ఓల్డ్ సాంగ్స్ ను రీమేక్ చేయడం, సినిమాలకు సీక్వెల్స్ తీయడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరిగే విషయాలే. అయితే గత ఇరవై ఏళ్లుగా పాత సినిమాల టైటిళ్లను కూడా టాలీవుడ్‌లో కాపీ చేస్తున్నారు. పాత టైటిళ్లతో కొత్త సినిమాలను రిలీజ్ చేసి కొందరు మంచి హిట్లు అందుకోగా మరికొందరు ఫ్లాపులు, డిజాస్టర్లు చవి చూడటంతో పాటూ ఆ సినిమాలకు ఉన్న లెగసీని పోగొడుతున్నారు. ఆ కొత్త-పాత సినిమాల టైటిళ్లతో విడుదలైన సినిమాలేంటో చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్-దర్శకుడు బి.ఎన్ రెడ్డి కాంబినేషన్‌లో 1951లో వచ్చిన మల్లీశ్వరి భారీ కలెక్షన్లు సాధించింది. ఇదే టైటిల్‌తో హీరో విక్టరీ వెంకటేష్-డైరెక్టర్ విజయ భాస్కర్ కాంబోలో 2004లో విడుదలైన మల్లీశ్వరి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1977లో వచ్చిన అడవి రాముడు అప్పట్లో రికార్డుల ప్రభంజనం సృష్టించింది. ఇదే టైటిల్‌తో ప్రభాస్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో 2004లో తెరకెక్కించిన సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
అక్కినేని నాగేశ్వరావు హీరోగా 1953లో నటించిన దేవదాసు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది. ఆతర్వాత 2006లో రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమా అదే స్థాయి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో 1992లో వచ్చిన బృందావనం సినిమా మంచి విజయాన్ని అందుకోగా అదే టైటిల్ తో 2010లో జూనియర్ ఎన్టీఆర్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం కూడా బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపింది.
అక్కినేని నాగేశ్వరరావు- జమున కాంబినేషన్‌లో 1971లో వచ్చిన శ్రీమంతుడు టైటిల్‌తోనే మహేశ్ బాబు 2015లో కొరటాల శివతో సినిమా చేయగా, ఆ మూవీ టాలీవుడ్ హిట్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక పవన్ కల్యాణ్ కెరీర్‌లోని భారీ హిట్ చిత్రాల్లో ఒక్కటైన ఖుషి పేరుతో విజయ్ దేవరకొండ గతేడాది ఖుషి సినిమాను రిలీజ్ చేశాడు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అలానే శ్రీకాంత్ కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న పెళ్లి సందడి టైటిల్‌తో అతడి కొడుకు రోషన్ హిట్‌ను రిపీట్ చేద్దామనుకున్నాడు కానీ రోషన్ అనుకున్న రిజల్ట్ ను అందుకోలేకపోయాడు.
పవన్ కళ్యాణ్ క్లాసిక్ సినిమా తొలి ప్రేమ టైటిల్‌ను అతని అన్నయ్య కొడుకు వరుణ్ తేజ్ వాడుకుని మంచి హిట్ అందుకున్నాడు. కె. విశ్వనాథ్ నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీని శంకరాభరణం టైటిల్ ను యంగ్ హీరో నిఖిల్ వాడుకుని డిజాస్టర్ అందుకున్నాడు. లోకనాయకుడు కమల్‌హాసన్ ట్రెండ్‌మార్క్ మూవీ మరో చరిత్ర టైటిల్ ను వరుణ్ సందేశ్ వాడుకుని ఆ సినిమాతో ఫ్లాపు ను ఖాతాలో వేసుకున్నాడు. బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి టైటిల్ ను వాడుకుని ఇప్పుడు శర్వానంద్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. వీటితో పాటూ ఆరాధన, ముగ్గుర మొనగాళ్లు, ఆడాళ్లూ మీకు జోహార్లు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, శక్తి, మిస్సమ్మ ఇలా ఎన్నో పాత సినిమాల పేర్లతో కొత్త సినిమాలు వచ్చాయి. కాకపోతే వాటిలో ఎక్కువ సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోలేక ఫ్లాపులుగానే మారాయి.