''ఓం భీమ్‌ బుష్‌" టీజర్: నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్..!

ఓవరాల్ గా 'ఓం భీమ్ బుష్' అనేది లాజిక్స్ అన్నీ పక్కనపెట్టి థియేటర్లలో విపరీతంగా నవ్వుకునే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Update: 2024-02-26 15:00 GMT

గతేడాది 'సామజవరగమన' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఇప్పుడు "ఓం భీమ్‌ బుష్‌" అంటూ వస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణుతో పాటుగా రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ కు 'నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌' అనేది ట్యాగ్ లైన్. ఇందులో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్యాంగ్ బ్రదర్స్ నవ్వులు పూయించారు. ఈ క్రమంలో 'మన జీవితాలలో ఎంటర్టైన్మెంట్ నింపడానికి, ఈ ముగ్గురు వచ్చేసారహో' అంటూ మేకర్స్ లేటెస్టుగా టీజర్ ను ఆవిష్కరించారు.

ముగ్గురు శాస్త్రవేత్తలుగా క్లిష్టమైన పరిస్థితిలో బెడ్ మీదున్న పేషెంట్ ను పట్టించుకోకుండా.. యూట్యూబ్‌లో హార్పిక్ యాడ్ స్కిప్ చేసి ఓ వీడియో చూడటానికి వెయిట్ చేస్తుండటంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. 'ఇందు మూలంగా మన భైరవపురం ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా.. మన జీవితాల్లో వెలుగు నింపడానికి ముగ్గురు సైంటిస్టులు సిటీ నుంచి విచ్చేసారహో' అంటూ దండోరా వేసి మరీ శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శిలను పరిచయం చేసారు. వీరు సిటీ నుంచి రూరల్ విలేజ్ కు వచ్చి 'A టూ Z సొల్యూషన్స్' స్టార్ట్ చేస్తారు. అయితే ఆ ఊర్లో ఉన్న నిధిని కనుక్కోవడం వీళ్ళ ఎజెండా అని తెలుస్తోంది. ఈ క్రమంలో వాళ్ళు అక్కడ చేతబడులు, క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు గమనించారు. ఆ తర్వాత ట్రెజర్ కోసం అన్వేషిస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది చూపించారు.

'ఓం భీమ్ బుష్' అనేది సినిమాల్లో తాంత్రిక విద్యలో జపించే మంత్రంగా వింటుంటాం. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే హారర్, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను జోడిస్తూ.. నిధిని కనుగొనే లక్ష్యంలో ఉన్న శాస్త్రవేత్తలుగా ముగ్గురు ప్రధాన పాత్రధారులను ప్రెజెంట్ చేసారు. హుషారు దర్శకుడు శ్రీహర్ష గత చిత్రం మాదిరిగానే ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చూపించాడు. A To Z సొల్యూషన్స్ పేరుతో శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి అక్కడి గ్రామస్థులతో జరిపిన సంభాషణలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. 'టుడే మన మీద మనం ఖర్చు.. టుమారో పీపుల్ మన గురించి గూగుల్ సెర్చు' అంటూ రాహుల్ చెప్పే ఫన్నీ డైలాగ్స్ అలరిస్తాయి.

దెయ్యం పట్టిన అమ్మాయి తనకు ఒక మగ పురుషుడు కావాలి అని అడగ్గా.. 'హే నేనే ఆ మగ పురుషుడిని' అని శ్రీవిష్ణు అంటాడు. దీనికి వెంటనే రేయ్.. నువ్వు దెయ్యాన్ని కూడా వదిలిపెట్టవారా' అని ప్రియదర్శి అనడం నవ్వు తెప్పిస్తుంది. అలానే 'మోస్ట్ ఇల్లాజికల్ అండ్ రెడిక్యులస్ మూవీ ఆఫ్ ది ఇయర్ - కరణ్ ఆదర్శ్' 'డిగ్రీస్ అక్కర్లేదు.. క్రింది స్థాయి వాళ్లకి కూడా అర్థం అవుతుంది - ప్రసాద్ ఐమాక్స్ క్రిటిక్స్' అంటూ సమీక్షకుల అభిప్రాయాలను కోట్ చేయడం దర్శకుడి తెలివితేటలను, సెన్సాఫ్ హ్యూమర్ ను తెలియజేస్తుంది. ఇక టీజర్ చివర్లో అంత సీరియస్ డిస్కషన్ లో చెడ్డీ గురించి మాట్లాడుకోవడం ఫన్నీగా ఉంది.

ఓవరాల్ గా 'ఓం భీమ్ బుష్' అనేది లాజిక్స్ అన్నీ పక్కనపెట్టి థియేటర్లలో విపరీతంగా నవ్వుకునే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇది 'జాతిరత్నాలు' తరహా సినిమాని గుర్తు చేస్తుంది. ఇందులో శ్రీవిష్ణు ఎప్పటిలాగే తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు కూడా తమవంతు నవ్వించే పాత్రలు పోషించారు. ఇంతకముందు 'బ్రోచేవారెవరురా' సినిమాలో వీరి ముగ్గురి కాంబినేషన్ కు, కెమిస్ట్రీకి ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకున్నారు. ఇప్పుడు బ్యాంగ్ బ్రదర్స్ గా మరోసారి ఎంటర్టైన్ చేయబోతున్నట్లు హామీ ఇచ్చారు. టీజర్ లో కథానాయికలు ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

'ఓం భీమ్ బుష్' సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ సినిమా మూడ్ కి తగ్గట్లుగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ & సునీల్ బలుసు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Full View
Tags:    

Similar News