కెరీర్ మొత్తానికి ఇలాంటి ఒక్క పాత్ర చాలు

అలాంటిది మలయాళం టాప్ స్టార్లలో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘ది గోట్ లైఫ్’లో చేసిన నజీబ్ పాత్రను చూస్తే దిమ్మదిరిగిపోతుంది.

Update: 2024-03-29 15:30 GMT

మన దగ్గర స్టార్ హీరోలు కొంచెం డీగ్లామరస్‌గా కనిపించే రోల్స్ చేయడానికి కూడా ఆలోచిస్తుంటారు. ‘రంగస్థలం’ లాంటి సినిమాల వల్ల కొంత మార్పు వచ్చినా సరే.. హీరోలు హీరోయిజం లేని డీగ్లామరస్ రోల్స్ చేయడాలంటే తటపటాయిస్తారు. అలాంటిది మలయాళం టాప్ స్టార్లలో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘ది గోట్ లైఫ్’లో చేసిన నజీబ్ పాత్రను చూస్తే దిమ్మదిరిగిపోతుంది.

ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ మోసపోయి బానిస బతుకు అనుభవించి.. అక్కడి నుంచి తప్పించుకుని ఎడారిలో నానా కష్టాలు పడి.. మృత్యు అంచులదాకా వెళ్లి చివరికి అక్కడ్నుంచి బయటపడ్డ ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. వాస్తవంగా ఒక వ్యక్తికి జరిగిన దారుణ అనుభవాన్నే బెన్యమిన్ అనే రచయిత నవలగా రాస్తే అది మలయాళంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ నావెల్స్‌లో ఒకటిగా నిలిచింది. దాన్నే బ్లెస్సీ అనే దర్శకుడు పృథ్వీరాజ్‌ను పెట్టి సినిమాగా తీశాడు.

ఇలాంటి పాత్ర గురించి చదివి సినిమా చేయడానికి రెడీ అవడమే పెద్ద సాహసం. అందులోనూ మలయాళంలో తీరిక లేకుండా సినిమాలు చేస్తూ.. నటుడిగానే కాక దర్శకుడిగా కూడా బిజీగా ఉన్న పృథ్వీరాజ్ నాలుగేళ్లకు పైగా సమయం వెచ్చించి ఈ చిత్రం కోసం పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా 31 కిలోల బరువు తగ్గి.. చిక్కి శల్యమైన రూపంలో తెరపై కనిపించడం వెనుక ఎంత కష్టం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక నజీబ్ పాత్రలో పరిణామ క్రమాన్ని తెరపై కళ్లకు కట్టేలా చూపిస్తూ పృథ్వీరాజ్ అందులో జీవించిన విధానం గురించి ఏమని చెప్పాలి? మనకూ ఓ టామ్ హాంక్స్ ఉన్నాడని గర్వంగా చెప్పుకునేలా ఆ పాత్రను పోషించాడు. కొన్ని సన్నివేశాల్లో పృథ్వీరాజ్ అభినయానికి కన్నీళ్లు రాకుండా మానవు. అసలు ఒక స్టార్ హీరోను చూస్తున్నామనే ఫీలింగే రానివ్వకుండా ఒక అభాగ్యుడి పాత్రను పండించిన విధానానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. కెరీర్ మొత్తానికి ఏ నటుడికైనా ఇలాంటి ఒక్క పాత్ర చాలు. తన పేరు చిరస్మరణీయంగా సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.

Tags:    

Similar News