ఆస్కార్స్‌కి వెళితే ప‌బ్లిసిటీ పెరుగుతుంద‌ని..!

కేవ‌లం ప్ర‌చారార్భాటం కోసం అంద‌రి ముందు గొప్ప‌లు పోవ‌డం కోస‌మైతే ఆస్కార్ బ‌రిలోకి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని కూడా కొంద‌రు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.

Update: 2023-09-21 23:30 GMT

ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి తెర‌కెక్కించిన RRR ఆస్కార్స్‌లో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై భార‌త‌దేశ గౌర‌వాన్ని అమాంతం పెంచింది. ఆస్కార్ బ‌రిలో పోటీ చేయ‌డం, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ కి వెళ్ల‌డం వ‌గైరా అంశాలు ఆర్.ఆర్.ఆర్ బృందానికి అమాంతం మైలేజ్ ని పెంచాయి. అయితే ప్ర‌చారం కోసం మాత్ర‌మే కాకుండా, నిజ‌మైన భార‌తీయ‌ ప్ర‌తిభ‌ను విశ్వ‌వేదిక‌పై ఆవిష్క‌రించాల‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ చేసిన ప్ర‌య‌త్నం గొప్ప స‌క్సెసైంది. ఈసారి ఛాన్స్ ఎవ‌రికి? అనేది ఇప్ప‌టికే ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో తెలుసుకోవాల‌న్న‌ ఆస‌క్తి నెల‌కొంది.

ఇంత‌లోనే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయింది. ఈసారి భార‌త‌దేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్ర‌వేశిస్తుంది? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. బలగం -ది కేరళ స్టోరీ-జ్విగాటో-రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి. షారూఖ్ జ‌వాన్ చిత్రాన్ని కూడా ఆస్కార్ కి పంపిస్తున్నార‌ని కొన్ని యూట్యూబ్ చానెళ్లు క‌థ‌నాలు వేసాయి. ఏది ఏమైనా ఆస్కార్ కమిటీ చెన్నైలో అనేక ప్రదర్శనలను వీక్షించ‌డం ద్వారా తన ప్రక్రియను ప్రారంభించింది. వచ్చే వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఆస్కార్స్ 2024 ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్ప‌టికే టాక్ వినిపించ‌గా ఈసారి నామినేష‌న్ల కోసం చాలా సినిమాలు పోటీబ‌రిలో ఉన్నాయ‌ని తెలిసింది. అకాడమీ అవార్డ్స్ 2023లో RRR - ది ఎలిఫెంట్ విస్పరర్స్ (గునీత్ మోంగా ) వంటి చిత్రాల తర్వాత ఈ సంవత్సరం భారతీయ సినిమా నుంచి చాలా సినిమాలు పోటీకి దిగుతున్న‌ట్టు తెలిసింది. హిందుస్థాన్ టైమ్స్ క‌థ‌నం ప్రకారం, ద‌ర్శ‌క‌నిర్మాత గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని 17 మంది సభ్యుల కమిటీ చెన్నైలో స్క్రీనింగ్‌లలో అన్ని ఎంట్రీలను సమీక్షిస్తున్నాను. ఈ కమిటీకి భారతదేశం నలుమూలల నుండి 22కి పైగా ఎంట్రీలు వచ్చాయి.

ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక స‌మాచారం మేర‌కు.. ఆస్కార్ ఎంపిక కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పంపిన కొన్ని చిత్రాలలో అనంత్ మహదేవన్ - ది స్టోరీటెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), శ్రీమతి వంటి పేర్లు ఉన్నాయి. ఛటర్జీ vs నార్వే (హిందీ), ట్వ‌ల్త్ ఫెయిల్ (హిందీ), విడుతలై పార్ట్ 1 (తమిళం), ఘూమర్ (హిందీ), దసరా (తెలుగు) వంటి చిత్రాలు రేసులో ఉన్నాయి. జాబితాలో వాల్వి (మరాఠీ), గదర్ 2 (హిందీ), అబ్ తో సబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లియోక్ (మరాఠీ) వంటి సినిమాలు పోటీకి దిగే ఛాన్సుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి చెన్నైలో ఆస్కార్ స్క్రీనింగ్‌లు ప్రారంభమైనందున, ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

నాటు నాటు దేశానికి గ‌ర్వ‌కార‌ణం..

మార్చి 13న జరిగిన 95వ అకాడమీ అవార్డ్‌లు భారతదేశానికి గర్వకారణంగా నిలిచాయి. ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో భార‌త‌దేశం నుంచి ఎంట్రీలు ఒకటి కాదు రెండు కాదు... డ‌జ‌న్ల కొద్దీ బ‌రిలో నిలిచాయి. ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ పాట 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా గెలుపొందగా, కార్తికీ గోన్సాల్వేస్ - గునీత్ మోంగాల 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఎమిలీ బ్లంట్, శామ్యూల్ ఎల్ జాక్సన్, డ్వేన్ జాన్సన్, మైఖేల్ బి జోర్డాన్, జానెల్ మోనే, జో సల్దానా, జెన్నిఫర్ కన్నెల్లీ, రిజ్ అహ్మద్, మెలిస్సా మెక్‌కార్తీ వంటి వారితో కలిసి 2023 ఆస్కార్స్‌లో దీపికా పదుకొణె కూడా సందడి చేసింది.

ఇలా అయితే వెళ్లినా దండ‌గే:

కేవ‌లం ప్ర‌చారార్భాటం కోసం అంద‌రి ముందు గొప్ప‌లు పోవ‌డం కోస‌మైతే ఆస్కార్ బ‌రిలోకి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని కూడా కొంద‌రు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. హాలీవుడ్ మీడియాలో హైలైట్ అవ్వాల‌ని, అక్క‌డ ప్ర‌ముఖుల‌ను క‌లుసుకోవాల‌ని, లేదా త‌మ‌కు పాన్ వ‌ర‌ల్డ్ అప్పీల్ కావాల‌నుకుని వెళితే భంగ‌పాటు త‌ప్ప‌దు. ఇక్క‌డ ప్ర‌తిభ మాత్ర‌మే కొల‌మానం. మంచి కంటెంట్ కి ఎప్పుడూ అవ‌కాశం ఉంటుంది. అలాంటి మంచి ప్ర‌య‌త్నం మ‌న‌ ఔత్సాహికఫిలింమేక‌ర్స్ చేయాల్సి ఉంది.

Tags:    

Similar News