'పాతాళ్‌ లోక్‌' సీజన్-2 ఎలా ఉందంటే..?

తొలి భాగాన్ని మించి సీజన్‌-2 ను తీర్చిదిద్దినట్లుగా సోషల్ మీడియాలో టాక్ ని బట్టి అర్థమవుతోంది.

Update: 2025-01-18 09:56 GMT

కరోనా లాక్ డౌన్ టైంలో తెలుగు ప్రేక్షకులకు అసలైన క్రైమ్ థ్రిల్ల‌ర్ మజాని పరిచయం చేసిన ఓటీటీ కంటెంట్ లో ''పాతాళ్‌ లోక్‌'' వెబ్ సిరీస్ ఒకటి. 2020లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి సూప‌ర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్ గా నాలుగేళ్ళ తర్వాత రెండో సీజన్ ను రూపొందించారు. ట్రైలర్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన 'పాతాళ్‌ లోక్‌ 2' జ‌న‌వ‌రి 17 నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తొలి భాగాన్ని మించి సీజన్‌-2 ను తీర్చిదిద్దినట్లుగా సోషల్ మీడియాలో టాక్ ని బట్టి అర్థమవుతోంది.

'పాతాల్ లోక్' సీజన్ 2 లో ఢిల్లీ పోలీసాఫీసర్ హాథీరామ్ చౌదరి (జయదీప్‌ అహ్లావత్‌) ఒక హై ప్రొఫైల్ కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం నాగాలాండ్‌కు వెళ్తాడు. ఈసారి అతను నాగాలాండ్ డెమోక్రటిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు థామ్ హత్యను ఛేదించే పనిలో పడ్డాడు. ఇంతలో అక్కడ రఘు పాశ్వాన్ అనే కూలీ అదృశ్యమయ్యాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంబంధం లేని ఈ రెండు కేసులను సాల్వ్ చేస్తున్న హాథీరామ్ కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చీకటి ప్రపంచంలోకి లోతుగా వెళ్లే కొద్దీ ఎలాంటి విషయాలు వెలుగుచూశాయి? ఈ క్రమంలో ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు మిస్టరీ కేసును ఛేదించాడా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

'పాతాళ్ లోక్' సీజ‌న్‌-1 కు సుదీప్ శ‌ర్మ క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించగా.. అవినాష్ అరుణ్, ప్రసిత్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సమాజంలోని వివక్షను.. ధ‌నిక‌, పేద అంత‌రాల‌ను.. మీడియా వ్య‌వ‌స్థ‌లోని లోతుపాతుల్ని అంత‌ర్లీనంగా ఈ వెబ్‌ సిరీస్‌లో చర్చించారు. సొసైటీలో ప‌లుకుబ‌డి క‌లిగిన కొంద‌రు వ్య‌క్తులు తమ ఉనికి కోసం వేసే ఎత్తుల్లో సామాన్యులు ఎలా బ‌లిప‌శువులుగా మారుతార‌నేది చూపించారు. ఇప్పుడు 'పాతాళ్ లోక్' సీజ‌న్‌-2 అనుష్క శర్మ రూపొందించగా.. అవినాష్ అరుణ్ ధావేర్ దర్శకత్వం వహించారు. 8 ఎపిసోడ్స్ గా హిందీతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సీజ‌న్‌-2లో బలమైన పాత్రలు, ప్రధాన నటీనటుల పెరఫార్మన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా నిలిచాయని తెలుస్తోంది. కాకపోతే మొదటి సీజన్ తో పోల్చుకుంటే థ్రిల్స్, సస్పెన్స్ లోపించిందని అంటున్నారు. నాగాలాండ్ నేటివిటీతో కనెక్ట్ అవడం కొంచం కష్టం అవుతుందని, అక్కడక్కడా కథనం గందరగోళానికి గురి చేసేలా ఉందని చెబుతున్నారు. అయితే ఫస్ట్ సీజన్ చూడకపోయినా పెద్దగా ఇబ్బంది లేకుండా కొత్త కథాంశంతో రెండో సీజన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. నరేన్ చంద్రవర్కర్, బెనెడిక్ట్ టేలర్ బ్యాగ్రౌండ్ స్కోర్.. డైరెక్టర్ అవినాష్ అరుణ్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇక కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్‌ చౌదరీగా జైదీప్ అహ్లావత్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఓవైపు డ్యూటీ, మరోవైపు ఫ్యామిలీ మధ్య నలిగిపోతున్న మధ్యతరగతి పోలీసుగా మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే పోలీసాఫీసర్ అన్సారీగా ఇష్వాక్ సింగ్.. ఈ సీజన్ లో కేసుల మధ్య కీలక సంబంధాలను వెలికితీసేందుకు హాథీ రామ్‌తో మళ్లీ కలిసాడు. తిలోత్త‌మ షోమే, న‌గేష్ కుకునూర్‌తోపాటు మ‌రికొంద‌రు కొత్త న‌టీన‌టులు ఈ సీజన్ లో తమ ఉనికిని చాటుకున్నారు. ఓవరాల్ గా ఇంటెన్స్ డ్రామా, యాక్షన్, ట్విస్టులు, క్లిష్టమైన పాత్రలు, సంతృప్తికరమైన క్లయిమాక్స్ తో కూడిన ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూశామనే అనుభూతిని కలిసాగిస్తుంది.

Tags:    

Similar News