పల్లవి ప్రశాంత్ కు షాక్.. జూబ్లీహిల్స్ లో కేసు నమోదు

బిగ్ బాస్ సీజన్-7 విజేత, తెలుగు యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ కు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు

Update: 2023-12-18 14:07 GMT

బిగ్ బాస్ సీజన్-7 విజేత, తెలుగు యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ కు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశాంత్ తో పాటు అతడి అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ ఘటనలను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అసలేం జరిగిందంటే

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపలకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ పేరు ప్రకటించగానే అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఇరువురి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. అది దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ గట్టిగా కొట్టుకున్నారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ చెందిన ఆరు బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు అభిమానులు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనలను సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ''అభిమానం పేరుతో చేసే పిచ్చి పనులు కరెక్ట్ కాదు. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లే. ఇలాంటి పనులు చేస్తే ఆర్టీసీ ఊరుకోదు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే'' అని సజ్జనార్‌ తెలిపారు.

మరోవైపు, ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 రన్నరప్ అమర్ దీప్ కారుపై కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. మరో బిగ్‌ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయ‌ల్ కారుపై కూడా ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. వెనుక‌వైపు అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. ఆమెతో పాటు అశ్విని కారును కూడా ఫ్యాన్స్ డ్యామేజ్ చేశారు. ఈ దాడిలో కంటెస్టెంట్స్ కార్లు ధ్వంసం అవ్వడమే కాకుండా పలువురికి గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో మొత్తం మీద ఆరు బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ద్వంసం అయినట్లు తెలుస్తోంది. సీసీఫుటేజీ ఆధారాలతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన వారిపై ఐపీసీ 147, 148, 290, 353, 427రెడ్ విత్, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారందర్నీ అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News