ప్ర‌మాదంలో బావ మృతి.. సోద‌రి కండిష‌న్ సీరియ‌స్..న‌టుడి తీర‌ని ఆవేద‌న‌!

జార్ఖండ్‌లోని నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

Update: 2024-04-22 05:05 GMT

`స్పెష‌ల్ ఓపిఎస్` ఓటీటీ సిరీస్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠికి ఇప్పుడు ద‌క్షిణాదినా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అత‌డి న‌ట‌న‌ను తెలుగు ప్ర‌జ‌లు అభిమానిస్తున్నారు. అయితే స‌ద‌రు న‌టుడు ఓ యాక్సిడెంట్ కార‌ణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారు. శనివారం నాడు (ఏప్రిల్ 20) త్రిపాఠి సోదరి- బావ గారు కార్ యాక్సిడెంట్ కి గుర‌య్యారు. సోద‌రి సరితా తివారీ తీవ్రంగా గాయపడగా, బావ గారైన‌ రాజేష్ తివారీ మరణించారు. జార్ఖండ్‌లోని నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

బీహార్‌లోని తమ స్వగ్రామం నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న దంపతులు తమ కారు (డబ్ల్యూబీ44డీ-2899) అదుపు తప్పి అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో వాహ‌నం నుజ్జునుజ్జ‌యింది. జాతీయ మీడియాలోని ఒక క‌థ‌నం ప్రకారం.. స్థానిక నివాసితుల సహాయంతో, పోలీసులు రాజేష్ - సరితా తివారీ ఇద్దరినీ ధన్‌బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు రాజేష్ తివారీ తీవ్ర‌ గాయాలతో మరణించాడు. ఎమ‌ర్జెన్సీ గది వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. అయితే సరితా తివారీ అత్యవసర చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని సర్జికల్ ఐసియులో పరిస్థితి విషమంగా ఉంది.

భారతీయ రైల్వేలో పనిచేసి పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్‌లో ఉంటున్న రాజేష్ తివారీ బీహార్‌లోని తన గ్రామం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆగస్టు 2023లో 99 ఏళ్ల వయసులో తన తండ్రి పండిట్ బనారస్ తివారీని కోల్పోయిన పంక‌జ్ త్రిపాఠికి ఇది మరో పెద్ద‌ దెబ్బ. అత‌డు తీవ్ర దుఃఖంలో కూరుకుపోయారు. పంకజ్ త్రిపాఠి ఇటీవల నెట్‌ఫ్లిక్స్ చిత్రం `మర్డర్ ముబారక్‌`లో కనిపించారు. అత‌డి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి.

Tags:    

Similar News