దేవరకి పరుచూరి రివ్యూ... అలా చేస్తే వెయ్యి కోట్లు వచ్చేవి
సినిమాలో కథ చాలా చిన్నగా ఉన్నా దర్శకుడు కొరటాల శివ తన ప్రతిభతో చక్కగా చూపించాడు. ఎక్కువ బోర్ కొట్టించకుండా బాగా తీశారని చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా భారీ స్థాయిలో వసూళ్లు రావడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ సినిమాకు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు లవ్ కమ్ రొమాంటిక్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండి ఉంటే తప్పకుండా వెయ్యి కోట్ల సినిమా అయ్యి ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెద్ద హీరోల సినిమాలతో పాటు తన మనసుకు నచ్చిన సినిమాలు, ప్రత్యేకంగా అనిపించిన సినిమాలకు విడుదల అయిన కొన్ని రోజుల తర్వాత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. చిన్న గ్యాప్ తీసుకున్న తర్వాత దేవర సినిమాకు పరుచూరి వారు తమ పలుకులతో రివ్యూ ఇవ్వడం జరిగింది. సినిమాలో కథ చాలా చిన్నగా ఉన్నా దర్శకుడు కొరటాల శివ తన ప్రతిభతో చక్కగా చూపించాడు. ఎక్కువ బోర్ కొట్టించకుండా బాగా తీశారని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ సన్నివేశాల విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్దకి అభినందనలు అంటూ పరుచూరి ప్రశంసలు కురిపించారు.
ఎప్పటిలాగే ఎన్టీఆర్ తన నటనతో మెప్పించారు. రెండు విభిన్నమైన పాత్రలతోనూ భలే మెప్పించాడు. ఇలాంటి పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అని మొదట అనుమానం వ్యక్తం చేశాను. కానీ ఎన్టీఆర్ దేవర సినిమాకు సరైన హీరో అంటూ తన నటనతో నిరూపించారు. ఈ స్థాయిలో నట విశ్వరూపం చూపడం ద్వారా అభిమానులకు విందు భోజనం పెట్టినట్లు అయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సముద్రంలో అధిక భాగం సినిమాను నడిపించిన తీరు బాగుంది. స్క్రీన్‌ప్లే మాస్టర్‌గా శివ మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య మొదటి సగంలో సన్నివేశాలు ఉండి ఉంటే కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా అయ్యి ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
దేవర సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. మూడు పాటలతో పాటు ఆయన అందించిన బీజీఎం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ దేవర పాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు అనడంలో సందేహం లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్ అని పేరు కానీ ఆమెకు సరైన సన్నివేశం పడలేదు. ఆమె కేవలం డాన్స్‌లకు మాత్రమే పరిమితం అయింది. దర్శకుడు కొరటాల శివ మరోసారి తన సినిమాలో హీరోయిన్స్ కి స్కోప్ ఉండదు అని మరోసారి నిరూపించాడు. దేవర సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలో అయినా జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువ ఉంటుందేమో చూడాలి.