'పట్టుదల' మూవీ రివ్యూ
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం.. విడాముయర్చి. దీని తెలుగు వెర్షన్.. పట్టుదల.
'పట్టుదల' మూవీ రివ్యూ
నటీనటులు: అజిత్- త్రిష - అర్జున్ - రెజీనా కసాండ్రా - ఆర్ణవ్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
నిర్మాతలు: సుభాస్కరన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మగిల్ తిరుమణి
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం.. విడాముయర్చి. దీని తెలుగు వెర్షన్.. పట్టుదల. త్రిష కథానాయికగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: అర్జున్ (అజిత్) అజర్బైజాన్లోని బాకులో ఒక యుఎస్ కంపెనీలో ఉద్యోగి. అతడి భార్య కయల్ (త్రిష). ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నేళ్ల వరకు సంతోషంగా గడుపుతుంది. కానీ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలవుతాయి. పెళ్లయిన పన్నెండేళ్లకు ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయం తర్వాత కయల్ ను తన పుట్టింట్లో దించడానికి కారులో బయల్దేరతాడు అర్జున్. కానీ దారి మధ్యలో వీరి కారు బ్రేక్ డౌన్ అవుతంది. ఈ క్రమంలోనే కయల్ కిడ్నాప్ అవుతుంది. ఆమె కోసం వెతికే క్రమంలో అర్జున్ కు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటి.. ఇంతకీ కయల్ ఏమైంది? ఆమెను అర్జున్ కనిపెట్టాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: 'పట్టుదల' సంక్రాంతికే విడుదల కావాల్సిన సినిమా. కానీ ఆ సినిమా మీద కాపీ రైట్ కేసు పడడంతో నెల ఆలస్యంగా ఈ రోజు విడుదలైంది. హాలీవుడ్ మూవీ 'బ్రేక్ డౌన్'ను కాపీ కొట్టి ఈ సినిమా తీసిన విషయం తెలిసి నిర్మాణ సంస్థ కేసు వేస్తే.. ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఈ రోజు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఐతే బ్రేక్ డౌన్' ఏమీ ఈ మధ్య వచ్చిన చిత్రం కాదు. ఎప్పుడో 1997లో విడుదలైన సినిమా. వేరే జానర్లంటే ఓకే కానీ.. థ్రిల్లర్ సినిమాలు ఎంతగానో అప్ గ్రేడ్ అయిపోయి ప్రేక్షకుల మైండ్ ను బ్లాంక్ చేస్తున్న ఈ రోజుల్లో.. 28 ఏళ్ల కిందటి సినిమాను ఇప్పుడు ఫ్రీమేక్ చేస్తే ప్రేక్షకులు మెచ్చుతారని చిత్ర బృందం ఎలా అనుకుందో ఏమో? 'పట్టుదల' సినిమాను రూపొందించిన మగిల్ తిరుమణి కొన్నేళ్ల ముందు తీసిన 'తడమ్' సినిమాను ఒకసారి మళ్లీ చూసుకుని ఉంటే.. 'బ్రేక్ డౌన్' మూవీ దాని ముందు నిలవలేదని అర్థమై ఉంటుంది. ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురి చేసే.. ఉర్రూతలగూగించే అద్భుతమైన థ్రిల్లర్లు ఎన్నో ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సమయంలో 'పట్టుదల' కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయదు. ఇందులోని ట్విస్టుల్ని అసలు ట్విస్టులనే పరిగణించలేం. ఏ దశలోనూ ప్రేక్షకులను అవి ఆశ్చర్యపరచలేవు. ట్విస్టుల సంగతి పక్కన పెడితే.. థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణమైన రేసీ స్క్రీన్ ప్లే కూడా మిస్ కావడంతో 'పట్టుదల' ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ఒక భర్త.. ఒక భార్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 12 ఏళ్ల కాపురం తర్వాత విడిపోవాలనుకుంటుంది. కానీ భార్యను పుట్టింట్లోకి తీసుకెళ్లే ప్రయాణంలో ఆమె కిడ్నాప్ అవుతుంది. చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితుల్లో ఆ భర్త.. తన భార్యను ఎలా వెతికి పట్టుకున్నాడనే నేపథ్యంలో నడుస్తుంది 'పట్టుదల'. అజిత్ లాంటి పెద్ద మాస్ హీరోతో ఇలాంటి చిన్న పరిధి ఉన్న కథను చేయాలనుకోవడం ఆశ్చర్యమే. ఐతే కథ చిన్నదిగా అనిపించినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దాని స్పాన్ పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మగిల్ తిరుమణి అలాంటి ప్రయత్నమేమీ చేయకపోవడం కూడా అభినందనీయమే. అజిత్ కు ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా.. అతను ఏదనుకుంటే అది చేసేసి.. అడ్డొచ్చిన వాళ్లందరినీ చితగ్గొట్టేసి పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని కూల్చేసేలా కథను నడిపిస్తారని అనుకుంటాం కానీ.. అలాంటిదేమీ ఉండదు. ఐతే కథ ఆసక్తికరంగా సాగి.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మలుపులు ఉండి.. రేసీ స్క్రీన్ ప్లే తోడై ఉంటే.. 'పట్టుదల' కచ్చితంగా అజిత్ కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం అయ్యుండేది. కానీ థ్రిల్లర్ సినిమా నుంచి ఆశించే ట్విస్టులు.. థ్రిల్స్ ఏమీ ఇందులో లేకపోవడమే పెద్ద ట్విస్ట్ అని సినిమా పూర్తయ్యాక కానీ అర్థం కాదు.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ.. పెళ్లి.. ఎడబాటుకు సంబంధించి చాలా రొటీన్ గా.. బోరింగ్ గా.. డల్లుగా సాగే తొలి అరగంట ఎపిసోడ్ తోనే 'పట్టుదల' ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. టేకాఫ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. సినిమా థ్రిల్లర్ రూట్లోకి వెళ్లాక అయినా పరిస్థితి మారుతుందని అనుకుంటాం. కానీ ఏవో సన్నివేశాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఏవీ ఆసక్తి రేకెత్తించవు. ముందుకు సాగే కొద్దీ సినిమా సగటు కిడ్నాప్ డ్రామాలా కనిపిస్తుందే తప్ప.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే.. అబ్బుర పరిచే అంశాలేమీ కనిపించవు. ఏదైనా బ్యాంగ్ బ్యాంగ్ ఎపిసోడ్ వచ్చి ప్రేక్షకుల్లో ఊపు వస్తుందేమో అని ఆశిస్తాం కానీ.. ఎంతకీ అది జరగదు. హీరో తొలిసారి తిరగబడే యాక్షన్ ఎపిసోడ్ ఒక్కటి పర్వాలేదనిపిస్తుంది. విలన్ల బ్యాక్ స్టోరీ సైతం చాలా సాధారణంగా అనిపిస్తుంది. హీరో తన మిషన్ మొదలుపెట్టి మొత్తం విలన్ రాకెట్ ను దెబ్బ కొట్టే క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం బాగా తీశారు కానీ.. కథ పరంగా మాత్రం ఎక్కడా కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. సినిమా కోసం ఎంచుకున్న అజర్బైజాన్ నేపథ్యంలో ప్లస్ కాకపోగా.. చాలా చోట్ల చికాకు పెడుతుంది. ఇది మన సినిమా కాదనే ఫీలింగ్ కలిగిస్తుంది. ముగింపు సన్నివేశాల్లోనూ పెద్దగా మెరుపులు లేక 'పట్టుదల' తీవ్ర నిరాశనే మిగులుస్తుంది.
నటీనటులు: అజిత్ తన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కమర్షియల్ హంగులు లేని.. కథను అనుసరించి సాగే థ్రిల్లర్ మూవీలో నటించడం అభినందనీయమే. ఆయన ఫిల్మోగ్రఫీలో ఇదొక డిఫరెంట్ ఫిల్మే కానీ.. స్పెషల్ మాత్రం కాదు. అజిత్ వల్ల ఈ సినిమాకు చేకూరిన ప్రత్యేకత ఏమీ లేదు. పాత్ర.. పెర్ఫామెన్స్ పరంగా అజిత్ ముద్ర చూపించడానికి ఇందులో పెద్దగా అవకాశం లేకపోయింది. దీని కంటే అజిత్ ఎప్పుడూ చేసే రొటీన్ మాస్ మసాలా సినిమాలే మేలు అనిపిస్తుంది. త్రిష తన పాత్రను హుందాగా పోషించింది. తన లుక్.. నటన బాగున్నాయి. కానీ తనకు కూడా ఇందులో స్కోప్ తక్కువే. విలన్లుగా అర్జున్-రెజీనా బాగానే చేశారు కానీ.. వాళ్ల పాత్రల్లో కూడా బలం లేదు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్ణవ్ నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.
సాంకేతిక వర్గం: తాను చేసిన పెద్ద సినిమాల గురించి రిలీజ్ ముంగిట ఒక రేంజిలో ఎలివేషన్లు ఇస్తుంటాడు అనిరుధ్. కానీ ఈ చిత్రానికి మాత్రం మౌనం వహించాడు. అప్పుడే ఈ సినిమా విషయంలో అతడి అయిష్టత అర్థమైపోయింది. అది సంగీతం విషయంలో కూడా ప్రతిబింబించింది. ఉన్న రెండు పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా ఏదో మొక్కుబడిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 'బ్రేక్ డౌన్' నుంచి తీసుకున్న స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దానికి మగిల్ ట్రెండీగా అనిపించే స్క్రీన్ ప్లేను జోడించలేకపోయాడు మగిల్ తిరుమణి. ఎంత షాకింగ్ ట్విస్టునైనా ముందే గెస్ చేసేసే స్థాయిలో థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులకు అలవాటు పడిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి డల్ స్క్రీన్ ప్లేతో.. పేలని ట్విస్టులతో సినిమాను నడిపించి మెప్పించడం చాలా చాలా కష్టం.
చివరగా: పట్టుదల.. పట్టు లేని థ్రిల్లర్
రేటింగ్-2/5