OG.. OG అని అరిస్తే నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి: పవన్
తాజాగా మంగళగిరిలో విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో పవన్ కల్యాణ్ తన సినిమాలపై మాట్లాడారు. ''OG సినిమా 1980-90స్ మధ్య జరిగే స్టోరీ.
పవన్ కళ్యాణ్ ఓవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు', OG, 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. చాలా కాలంగా నిర్మాణం జరువుకుంటున్న ఈ ప్రాజెక్ట్స్, ఇంకా సెట్స్ మీదనే ఉన్నాయి. పవన్ క్రియాశీల రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఆయన సినిమాల ప్రాధాన్యతా క్రమం మారడం దీనికి కారణాలుగా చెప్పుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో.. అన్ని సినిమాలకి డేట్స్ ఇచ్చినా మేకర్స్ సద్వినియోగం చేసుకోలేదని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
తాజాగా మంగళగిరిలో విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో పవన్ కల్యాణ్ తన సినిమాలపై మాట్లాడారు. ''OG సినిమా 1980-90స్ మధ్య జరిగే స్టోరీ. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ఎక్కడికి వెళ్లినా అభిమానులు 'OG.. OG' అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. కానీ వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు. 'హరి హర వీరమల్లు' సినిమాకి సంబంధించి మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని సినిమాలూ పూర్తి చేస్తాను'' అని పవన్ తెలిపారు.
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో OG అనే గ్యాంగ్‌స్టర్ మూవీ తెరకెక్కుతోంది. ఆయన నటిస్తున్న సినిమాల్లో దీనికే ఎక్కువ హైప్ ఉంది. అందుకే ఇటీవల కాలంలో పవన్ ఎక్కడకు వెళ్లినా ‘OG .. OG..’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. అభిమానులు అలా స్లోగన్స్ ఇస్తే ఇన్నాళ్లూ ముసి ముసి నవ్వులు నవ్వే పవన్.. రీసెంట్ గా కడపలో మాత్రం ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేశారు. ''ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి'' అంటూ చిరాకు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని, అలా పిలుస్తుంటే తనకు బెదిరింపులుగా అనిపిస్తున్నాయని పవన్ వాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లనే సినిమాలు లేట్ అవుతున్నాయని అందరూ భావించారు. కానీ పవన్ మాత్రం తాను డేట్స్ ఇచ్చినా మేకర్స్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదని అంటున్నారు. ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు కాబట్టి, త్వరలోనే 'హరిహర వీరమల్లు', ఓజీ షూటింగ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి బల్క్ డేట్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. ''సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఎన్నో ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం అవుతాయి'' అని పవన్ కల్యాణ్ అన్నారు.