ప్రకాష్ రాజ్ కి సంబంధం ఏంటి?... పవన్ కళ్యాణ్ ఆగ్రహం
హిందువుల ఆలయాల పరిరక్షణ కోసం సనాతన ధర్మ రక్షణ వ్యవస్థని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హిందువుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జరిగిన పాపానికి పరిహారంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. హిందువుల ఆలయాల పరిరక్షణ కోసం సనాతన ధర్మ రక్షణ వ్యవస్థని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీపై రియాక్ట్ అయిన విధానంపై సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి భిన్నమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి.
మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ట్వీట్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంచు విష్ణు కూడా సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
హిందువుల గురించి మాట్లాడితే మీకొచ్చిన సమస్య ఏంటి అని పవన్ ప్రశ్నించారు. హిందూ దేవాలయంలో జరిగిన అపచారం గురించి ప్రస్తావించాను. వేరొక మతాన్ని ఏమైనా నిందించానా.. ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి తప్పుగా మాట్లాడానా… తిరుపతిలో అపవిత్రం జరిగింది. అలా జరగకూడదని మాట్లాడితే తప్పేలా అవుతుంది. తప్పు జరిగినపుడు మాట్లాడొద్దు అంటే ఎలా.. దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దు అంటున్నారు.
ప్రకాశ్ రాజ్ గారు మీరంటే నాకు గౌరవం ఉంది. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే సెక్యూలరిజానికి విఘాతం కలుగుతుందని ఎలా అంటారు అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సెక్యులర్ అంటే రెండు వైపులా మాట్లాడాలి. కేవలం హిందువులపై, సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా దాడి చేస్తూ మనోభావాలు హర్ట్ అయ్యి మాట్లాడితే సెక్యులరిజం అంటూ హడావిడి చేయకూడదు. హిందూ దేవీ దేవతల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఇలా ఇస్లాం మీద మీరు మాట్లాడగలారా..? జీసెస్ మీద మాట్లాడగలరా…? హిందువుల మనోభావాల గురించి మాట్లాడితేనే మీకు సమస్య వస్తుందా… నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.