గేమ్ ఛేంజ‌ర్‌తో ఆ లోటు తీరుతుందా?

రంగ‌స్థ‌లం విడుద‌లై ఇప్ప‌టికే ఆరేళ్లు అయిపోతోంది. అయినా ఇప్ప‌టికీ ఆ సినిమాని జ‌నం అంత తేలిగ్గా మర్చిపోలేరు.

Update: 2025-01-06 00:30 GMT

ఇటీవ‌లి కాలంలో రామ్ చ‌ర‌ణ్ కి జాతీయ అవార్డ్ రావాల‌నే డిమాండ్ పెరుగుతోంది. అత‌డు న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రంలో అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని, కానీ జాతీయ అవార్డుల క‌మిటీ, జూరీ ప‌ట్టించుకోలేద‌ని అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. సుకుమార్ తెర‌కెక్కించిన `రంగ‌స్థ‌లం` 2018లో విడుద‌లైంది. ఈ చిత్రంలో గోదారి కుర్రాడిగా, చెవిటి మూగవాడిగా రామ్ చ‌ర‌ణ్ జీవించాడు. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌ నిజ‌మైన గోదారి యాస భాష క‌ట్టుబొట్టుతో మాస్ కుర్రాడిగా వంద‌శాతం ది బెస్ట్ ఇచ్చాడు. అందుకే రంగ‌స్థ‌లం అత‌డి ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచింది. చ‌ర‌ణ్ ని కెరీర్ బెస్ట్ గా నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు సుకుమార్. రంగ‌స్థ‌లంలో చిట్టిబాబుగా చ‌ర‌ణ్ ని అద్భుతంగా ఎలివేట్ చేసాడు.

రంగ‌స్థ‌లం విడుద‌లై ఇప్ప‌టికే ఆరేళ్లు అయిపోతోంది. అయినా ఇప్ప‌టికీ ఆ సినిమాని జ‌నం అంత తేలిగ్గా మర్చిపోలేరు. అలాంటి ఇంపాక్ట్ ఉన్న ప్ర‌ద‌ర్శ‌న‌ను చ‌ర‌ణ్ ఇచ్చాడు. ఇటీవ‌ల డ‌ల్లాస్ (అమెరికా) లోని గేమ్ ఛేంజ‌ర్ ప్ర‌చార వేదిక‌పై `రంగ‌స్థ‌లం` ద‌ర్శ‌కుడు సుకుమార్ మాట్లాడుతూ - `గేమ్ ఛేంజ‌ర్`లో చ‌ర‌ణ్ అత్యుత్త‌మ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని, అతడికి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ క‌న్ఫామ్‌గా వ‌స్తుంద‌ని అన్నాడు. శంక‌ర్ సినిమాతో చ‌ర‌ణ్‌కి అవార్డ్ సాధ్య‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసాడు.

ఈ శ‌నివారం సాయంత్రం యాధృచ్ఛికంగా `రంగ‌స్థ‌లం` తెర‌కెక్కిన అదే రాజ‌మండ్రి పరిస‌రాల్లో గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేదిక‌పై ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ .. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` చిత్రాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో చ‌ర‌ణ్ న‌ట‌న‌కు అవార్డ్ వ‌స్తుంద‌ని తాను ఆశించాన‌ని, అయితే ఆశించిన‌ది రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింద‌ని అన్నారు. అంటే ప‌వ‌న్ మాట్లాడింది.. చ‌ర‌ణ్ కి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ ద‌క్కుతుంద‌ని ప‌వ‌న్ బ‌లంగా న‌మ్మారు. కానీ అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితులు, తెలుగు సినిమాపై చిన్న చూపు కార‌ణంగా ఆశించిన‌ది రాలేదు.

చ‌ర‌ణ్ పెరిగింది చెన్నై, హైద‌రాబాద్ లాంటి చోట‌. కానీ అత‌డు రంగ‌స్థ‌లం చిత్రంలో గోదారి కుర్రాడిగా ఎంతో ఒదిగిపోయి న‌టించాడు. అస‌లు రాజ‌మండ్రి ప‌రిస‌రాల‌తో అత‌డికి ఎలాంటి సంబంధం లేక‌పోయినా పాత్ర‌ను వోన్ చేసుకుని అద్బుతంగా న‌టించాడ‌ని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. `పుష్ప` (2021) చిత్రంలో న‌ట‌న‌కు అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. నెక్ట్స్ రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` చిత్రంతో ఈ ఫీట్ సాధించాల‌ని, జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం అందుకోవాల‌ని మెగాభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News