ఫిలిం టూరిజంతోనే APకి ఊపు: ఉప ముఖ్యమంత్రి పవన్
ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాచరణ్ సినీవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది.
ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాచరణ్ సినీవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. న్యూజిలాండ్ , ఉక్రెయిన్ వంటి దేశాలు సినిమా టూరిజం ద్వారా అభివృద్ధి చెందాయని, ఆయా దేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో ఫిలింటూరిజాన్ని ప్రోత్సహించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైనా సినిమాలో ఒక సన్నివేశంలో ఏపీలో అందమైన లొకేషన్లను హైలైట్ చేయడం ద్వారా అది పాంప్లెట్ లాగా ప్రచారానికి సహకరిస్తుందని పవన్ అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో చలనచిత్ర పరిశ్రమ కీలక పాత్రను పవన్ హైలైట్ చేశారు. ప్రతి సినిమాలో ఏపీ లొకేషన్లను హైలైట్ చేయడం ద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని బలమైన సూచన చేసారు. ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చే ప్రణాళికలను ఆయన వివరించారు.
నంద్యాలలో ఏనుగుల శిబిరాలు, గండికోట కొండలు, హార్సిలీ హిల్స్, కోరింగ మడ అడవులు వంటి ల్యాండ్‌మార్క్‌లను ప్రోత్సహించడం వంటి పర్యావరణ టూరిజం కార్యక్రమాలు యువతకు ఉపాధి కల్పించే మార్గాలుగా పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తక్కువ ప్రచారంలో ఉన్న పర్యాటక ఆకర్షణలను హైలైట్ చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని కళ్యాణ్ కోరారు. తిరుపతి, శ్రీశైలం వంటి గమ్యస్థానాలకు రైల్వే శాఖ సహకారంతో కాలానుగుణ ప్రత్యేక రైళ్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.
దేవాలయం, పర్యావరణం, అడ్వెంచర్ , హెరిటేజ్ టూరిజంను పెంపొందించడానికి శాఖల మధ్య సమన్వయ ఆవశ్యకతను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, సుందరమైన ప్రదేశాలు, సాహస క్రీడలు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని పవన్ అన్నారు.
ఏపీలోని ఆలయాల పవిత్రతను కాపాడటం, వాటికన్ సిటీ, జెరూసలేం వంటి తీర్థయాత్రలతో సమాంతరంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వివరించారు. దేవాలయాల ప్రాధాన్యతను ప్రతి గ్రామంలో యువతరానికి వివరించాలని కూడా సూచించారు. సంబంధిత శాఖల మంత్రులతో ప్రత్యేకంగా సినిమా టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా పవన్ కోరారు. సినిమా టూరిజంపై ఆయన సూచనలు అద్భుతంగా ఉన్నాయని తెలుగు చిత్రసీమలో చర్చ సాగుతోంది. అయితే ఏపీలో సినీపరిశ్రమ అభివృద్దికి నిబద్ధతతో కూడుకున్న ప్రణాళికను ఏపీఎఫ్‌డిసి (సినిమా టీవీ రంగ అభివృద్ధి సంస్థ) ఇంతవరకూ ప్రకటించలేదు.