తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టారే అవుతాడు: పవన్
ఆయన ఈ వేదికపై ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కంటే, చరణ్‌కి బాబాయ్ ని అనే హోదాలోనే ఎక్కువగా మాట్లాడారు.
ఈరోజు తూ.గో జిల్లా రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకలో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీచ్ ఆద్యంతం రక్తి కట్టించింది. ఆయన ఈ వేదికపై ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కంటే, చరణ్‌కి బాబాయ్ ని అనే హోదాలోనే ఎక్కువగా మాట్లాడారు. అంతేకాదు చరణ్ కి తాను బాబాయ్ కాదని, అన్నయ్యను అని అన్నారు. చిరంజీవి నాకు అన్నయ్య మాత్రమే కాదు... పితృ సమానులు... మా వదిన నాకు మాతృమూర్తి.. నేను చరణ్‌కి ఒక బాబాయ్ ని కాదు.. నాకు చరణ్ ఒక తమ్ముడు.. అని కూడా ఎమోషనల్ గా మాట్లాడారు పవన్.
సంక్రాంతి బరిలో రిలీజ్ కి వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు సర్వత్రా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రీరిజలీజ్ లో పవన్ స్పీచ్ ఆద్యంతం సినిమాపై హైప్ పెంచింది. ముఖ్యంగా రామ్ చరణ్ ప్రతిభ, హార్డ్ వర్క్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి పవన్ స్పీచ్ లో ప్రధానంగా హైలైట్ చేసారు.
చిరంజీవిగారి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు? అంటూ వేదిక వద్ద ఉన్న చరణ్ అభిమానులను పవన్ కల్యాణ్ ఉత్సాహపరిచారు. ''తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టారే అవుతాడు'' అంటూ పంచ్ లైన్‌తో మురిపించారు. చరణ్ తో తన అనుబంధం గురించి పవన్ సుదీర్ఘంగా మాట్లాడారు. తాను చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడినని .. తమ్ముడు సినిమాలో తరహాలో బద్ధకంగా ఉండేవాడినని కూడా గుర్తు చేసుకున్నారు. చిన్నవయసులోనే చరణ్ హార్డ్ వర్క్ చేసాడు. హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి హెల్మెట్ షూస్ అన్నీ రాత్రి వేళ సర్ధుకుని వెళ్లేవాడు. అంతటి క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. చరణ్ లో ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎవరికీ తెలీదు.
మొన్న అరకు, పచ్చని వాతావరణంలో జీవిస్తున్న గిరిజనలను చూసి అసూయపడ్డాను. 'మగధీర'లో చరణ్ హార్స్ రైడింగ్ చూసి అసూయపడ్డాను.. అని ఛలోక్తిగా మాట్లాడారు పవన్. నేను గబ్బర్ సింగ్ లో మోసం చేసాను.. హార్స్ రైడింగ్ వచ్చినట్టు నటించాను. కానీ చరణ్ నాలాగా కాదు. అన్నీ నేర్చుకున్నాడు.. లండన్ యూనివర్శిటీకి వెళ్లాడని కూడా తెలిపాడు. అలాగే చరణ్ లో ఇంత శక్తి సామర్థ్యాలు నేను ఇంతకుముందు చూడలేదు. ఎప్పుడూ ఇంత డ్యాన్స్ చేయడం నా లైఫ్ లో చూడలేదు. చరణ్ వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడూ చూడలేదు. మ్యూజిక్ ఆన్ అయితే కాలు కదల్చడమే కాదు అతడు అద్బుతమైన డ్యాన్సర్.. అంటూ పొగిడేశారు పవన్ కల్యాణ్.
ఉత్తమ నటుడు అవార్డ్ వస్తుందనుకున్నా:
సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చూశాక చరణ్ 'ఉత్తమ నటుడు' (జాతీయ) అవార్డ్ అందుకుంటాడు అనుకున్నాను. చరణ్ ఇక్కడ (గోదారి జిల్లాల్లో) పెరగలేదు. ఆంధ్రాలో పెరగలేదు. ఎదిగే వయసులో కీలక సంవత్సరాల్లో తమిళనాడు, హైదరాబాద్ లలో పెరిగాడు. గోదావరి జిల్లాల తాలూకా కల్చర్ ని, భావాలను ప్రత్యక్షంగా అతడు ఎప్పుడూ చూడలేదు. అయినా రంగస్థలంలో గోదావరి కుర్రాడి పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడు అంటే.. కొన్ని తరాలుగా ఇక్కడే జీవించిన వాడికి తెలిసినట్టుగా నటించాడు! అని పవన్ చరణ్ ప్రతిభను కీర్తించారు.