పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్లోబల్ ఎంట్రీ.. మంత్రి కోమటిరెడ్డితో ప్రత్యేక భేటీ
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన 50వ సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో ఎంట్రీకి సిద్ధమవుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన 50వ సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను సంస్థ తన తొలి అంతర్జాతీయ ప్రొడక్షన్‌గా ప్రకటించింది. ఈసారి గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యంగ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ నేతృత్వంలో ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనుంది టాలెంటెడ్ డైరెక్టర్ హసాన్. ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చల కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బృందం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కలసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన 50వ చిత్రాన్ని (PMF50) గ్లోబల్ ప్రొడక్షన్‌గా తీసుకురావడం సినిమారంగంలో ఒక బిగ్ అచివ్ మెంట్ గా చెప్పవచ్చు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు అందించిన ఈ నిర్మాణ సంస్థ, ఇప్పుడు గ్లోబల్ లెవెల్ మార్కెట్‌లోనూ తన సత్తా చాటడానికి సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో చర్చలు జరిపిన సంస్థ ప్రతినిధులు, గ్లోబల్ సినిమాటిక్ విజన్‌ను వివరించారు.
ఈ చర్చల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బృందం వారి గ్లోబల్ వ్యూహాలను మంత్రి గారితో పంచుకుంది. ఇక సమావేశంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, దర్శకురాలు హసాన్, ఇతర కీలక బృంద సభ్యులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్లోబల్ ఎంట్రీపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని మంత్రి అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PMF) పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రొడక్షన్ హౌస్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో 'ది రాజా సాబ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే మిరాయ్, గూఢచారి 2 వంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నాయి. ఇక ఇప్పుడు 50వ చిత్రాన్ని PMF50 గ్లోబల్ ప్రొడక్షన్‌గా ప్రకటించడం వలన ఇండస్ట్రీలో ఉత్కంఠ పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందనే ఆశలు ఉన్నాయి.
ఈ సినిమా పూర్తిగా హై టెక్నీకల్ ప్రమాణాలతో రూపొందనుందని ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు, ప్రఖ్యాత నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారని సమాచారం. ఇది తెలుగు సినిమా హవాను గ్లోబల్ లెవెల్‌లో చూపించబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విషయాలపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.