పీపుల్స్ మీడియా.. వచ్చేవన్నీ పెద్ద బడ్జెట్ తోనే..

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేస్తోన్న నిర్మాణ సంస్థగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉంది.

Update: 2024-10-21 05:03 GMT

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేస్తోన్న నిర్మాణ సంస్థగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఏడాదికి అరడజనుకి పైగా సినిమాలు వస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన ప్రొడక్షన్ లో మీడియం రేంజ్ నుంచి పాన్ ఇండియా మూవీస్ వరకు అన్ని నిర్మిస్తున్నారు. స్టార్ హీరోల ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్స్ పై ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న సినిమాలలో చాలా వరకు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కూడా అందుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి తెలుగు, తమిళ్ భాషలలో కలిపి 7 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో తెలుగులో వచ్చిన సినిమాలు ఏవీ కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. రవితేజ ‘ఈగల్’ డిజాస్టర్ అయ్యింది. ‘మనమే’ ఏవరేజ్ టాక్ తో బయటపడింది. ‘మిస్టర్ బచ్చన్’ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. శ్రీవిష్ణు ‘స్వాగ్’ మిశ్రమ రివ్యూలు తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు.

గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘విశ్వం’ మూవీ కూడా ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోలేదు. కేవలం 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన కూడా దానిని అందుకోవడానికి ఇబ్బంది పడుతోంది. మేజర్ చిత్రాలన్నీ కూడా 30 నుంచి 50 కోట్ల బడ్జెట్ లతో నిర్మితమైనవే కావడం గమనార్హం. 2025లో కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఐదు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. వాటిలో ముందుగా వచ్చేది ప్రభాస్ ‘ది రాజాసాబ్’. ఈ సినిమాపై కాస్తా హోప్స్ ఉన్నాయి.

అలాగే అడివి శేష్ హీరోగా ‘గూఢచారి 2’ మూవీ తెరకెక్కుతోంది. అతని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ రెడీ అవుతోంది. అయితే సూపర్ హిట్ మూవీ సీక్వెల్ గా వస్తుండటంతో దీనిపై కొంత పాజిటివ్ వైబ్ ఉంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ మూవీ తెరకెక్కింది. అతని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ఇది రెడీ అయ్యింది. టిల్లు సిరీస్ తో సిద్దుకి మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది ఇది. దీంతో ‘తెలుసు కదా’ సినిమాకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా హిందీలో తెరకెక్కుతోన్న ‘జాట్’ చిత్రాన్ని మైత్రి భాగస్వామ్యం లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగానే సిద్ధం అవుతోంది. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ మూవీ సిద్ధం అవుతోంది. తేజ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ లైన్ అప్ లో ఉన్న ఐదు సినిమాలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News