'రాజాసాబ్‌' నిర్మాతల కొత్త ప్రయోగం..!

మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్ స్టార్‌ హీరో అజిత్‌ తో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-12-17 13:21 GMT

టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న నిర్మాతల్లో మైత్రి మూవీ మేకర్స్‌ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ తర్వాత స్థానంలో ఉంటుంది. సినిమాల నిర్మాణం మొదలు పెట్టిన తక్కువ సమయంలోనే 50 సినిమాలకు చేరువ అయిన ఈ నిర్మాణ సంస్థ ఒక వైపు ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోతో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ, మరో వైపు చిన్న సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వందల కోట్ల ప్రాజెక్ట్‌లను చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు త్వరలో కన్నడ సినిమాను చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.


మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్ స్టార్‌ హీరో అజిత్‌ తో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలోనూ వారి సినిమా ఉండబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుసగా ఇతర భాషల్లో సినిమాలను నిర్మించాలని భావిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారికి ఏమాత్రం తగ్గకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సైతం ఇతర భాషల్లో సినిమాలను నిర్మించాలని భావిస్తున్నారు. అందుకే కన్నడ స్టార్‌ నటుడు శ్రీమురళితో ఒక సినిమాను ప్రకటించారు. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు, కానీ శ్రీమురళితో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

శ్రీమురళి పుట్టిన రోజు సందర్భంగా ఒక పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను షేర్‌ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈమధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలను నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్‌ కన్నడ హీరోతో సినిమాను ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బ్యానర్‌లో శ్రీ మురళితో చేయబోతున్న సినిమా 47వ సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా దర్శకుడిని ప్రకటించడంతో పాటు షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటన చేశారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమాతో పాటు పవన్‌ కళ్యాణ్‌తోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా ఉంటుంది. మొత్తానికి పాన్‌ ఇండియా స్థాయిలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీజీ విశ్వప్రసాద్‌ మొదటగా కన్నడంలో సినిమాను చేయబోతున్నారు. మంచి కథతో శ్రీ మురళి హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కన్నడంలో వచ్చిన బఘీర సినిమాతో శ్రీ మురళి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సమయంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో శ్రీమురళి సినిమా కన్ఫర్మ్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News