'అమరన్' థియేటర్‌పై పెట్రోల్ బాంబ్
చెన్నైలోని అమరన్ ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.
శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన అమరన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అన్ని చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించింది. ఇదే సమయంలో సినిమాకు కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఒక మతంను కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చెన్నైలోని నిర్మాత కమల్ హాసన్ ఆఫీస్ ముందు ఒక మతంకు చెందిన వ్యక్తులు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చెన్నైలోని అమరన్ ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.
అమరన్ థియేటర్ల వద్ద హైటెన్షన్ గడం తప్పినట్లే అనుకుంటున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ పైకి పెట్రోల్ బాంబ్‌లతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అమరన్ ప్రదర్శింపబడుతున్న ఒక థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో చెప్పుకొచ్చారు.
పెట్రోల్ బాంబు దాడిలో ఎవరికి ఏం కాలేదని, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. ఒక మతంకు చెందిన వారు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి వారి సంస్థకు చెందిన వారు చేసి ఉంటారు అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది పోలీసుల ఎంకైరీలో తేలే అవకాశం ఉంది. అమరన్ థియేటర్ల వద్ద మరోసారి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆర్మీ నేపథ్యంలో సాగిన అమరన్ సినిమాలో ఉగ్రవాదులుగా ఒక మతంకు చెందిన వారిని చూపించారు అనేది విమర్శ.
ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, ముకుంద్ సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు లో భారీ వసూళ్లను ఈ సినిమా సాధించింది. సాయి పల్లవి క్రేజ్ తో సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించగా కమల్ హాసన్ ఒక నిర్మాతగా వ్యవహరించారు. పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుని మూడో వారంలోనూ థియేటర్ల ద్వారా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఆడుతున్న థియేటర్ పై దాడి జరగడం పట్ల సినీ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.