హీరో వెంకటేష్ - సురేష్ బాబుపై పోలీస్ కేసు నమోదు
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, రానా దగ్గుబాటి, అభిరామ్ లపై పోలీస్ కేసు నమోదైంది.
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, రానా దగ్గుబాటి, అభిరామ్ లపై పోలీస్ కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 448, 452, 458, ఐపీసీ సెక్షన్ 120(బి) తో కలిపి ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దక్కన్ కిచెన్ హోటల్ లోని లీజు స్థలాలలో అక్రమ కూల్చివేత , ఆస్తిలోకి చొరబాటు వంటి ఆరోపణలను ఎదుర్కొంటోంది దగ్గుబాటి కుటుంబం. నాంపల్లి సివిల్ కోర్టు నుండి పెండింగ్‌లో ఉన్న ఇంజక్షన్ , తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ డి. సురేష్ బాబు (ఏ1), వెంకటేష్ దగ్గుబాటి (ఏ2) సహా రానా, అభిరామ్ లు చట్టవిరుద్ధంగా తమ ఆస్తులలోకి ప్రవేశించి బౌన్సర్లు, ప్రయివేట్ వ్యక్తుల సహాయంతో నష్టం కలిగించారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. కొందరు జీవీఎంసి అధికారులు దీనికి సహకరించరని ఫిర్యాదులోను పేర్కొన్నారు.
ఆస్తులను కూల్చవద్దని కోర్టు ఆదేశం ఉండగానే, ఆస్తిలోకి జొరబాటు, కూల్చివేతలు దగ్గుబాటి హీరోలపై కేసులకు కారణమైంది. నిందితులంతా దాదాపు 20 కోట్ల ఆస్తిని దోచుకున్నారని కోర్టు నోటీసులో ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. 2022 నుంచి పలుమార్లు కూల్చివేతను ఆపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఫిర్యాదుదారు సిబ్బందిని బెదిరించి దాడి చేశారని అతడు ఆరోపించారు.
జనవరి 2024 లో మరోమారు పూర్తి స్థాయిలో కూల్చివేత ప్రయత్నాలు కొనసాగాయి కాబట్టి, అతిక్రమణ , నేరపూరిత కుట్ర సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరారు. ఈ ఫిర్యాదును దర్యాప్తు కోసం ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పంపడంతో వారు దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు చేసారు. ఈ కూల్చివేత వ్యవహారంలో సురేష్‌బాబు- ఏ1, వెంకటేష్- ఏ2, దగ్గుబాటి రానా- ఏ3, దగ్గుబాటి అభిరామ్- ఏ4గా కేసు పెట్టారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగనుంది.