బ్లాక్ టికెటింగ్ ఆరోపణల్లో `బుక్ మై షో` CEOకి సమన్లు
ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం బుక్ మై షోకి ఉన్న ఆదరణ గురించి తెలిసిందే.
ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం బుక్ మై షోకి ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. ఇది సామాన్య ప్రజల్లోను బాగా ప్రాచుర్యం ఉన్న వేదిక. నమ్మదగిన ప్లాట్ ఫామ్ గా ప్రజలందరిలోను పాపులరైంది. ఇక బుక్ మై షోలో టికెట్ సేల్ రికార్డుల గురించి కూడా నిరంతరం వార్తలు వస్తుంటాయి. అయితే ఇలాంటి వేదికకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వర్తించే సీఈవోకి దీనిపై ప్రశ్నించేందుకు పోలీసులు సమన్లు పంపారు.
పాపులర్ అమెరికన్ బ్యాండ్ `కోల్డ్‌ప్లే` కచేరీ టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ విక్రయాలపై విచారణలో భాగంగా బుక్‌మైషో మాతృ సంస్థ బిగ్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో ఆశిష్ హేమ రాజనీకి ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) సమన్లు జారీ చేసిందని జాతీయ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. వాంగ్మూలాలను అందించడానికి 2024 సెప్టెంబర్ 28న అంటే శనివారం నాడు విచారణ అధికారి ముందు హాజరు కావాలని కోరినట్టు తెలిసింది.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో 2025 జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న బ్రిటిష్ బ్యాండ్ కోల్డ్‌ప్లే సంగీత కచేరీ టిక్కెట్‌లను బుక్‌మైషో బ్లాక్ మార్కెటింగ్‌కు సులభతరం చేసిందని ఆరోపిస్తూ అడ్వకేట్ అమిత్ వ్యాస్ ఫిర్యాదు చేసిన తర్వాత సమన్లు పంపారు. మోసం ఆరోపణల ఆధారంగా కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్న వ్యాస్ .. రూ.2,500 ధర ఉన్న టిక్కెట్‌లను ఇప్పుడు థర్డ్ పార్టీలు అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రూ.3 లక్షలకు తిరిగి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇవోడబ్ల్యూ ఇప్పటికే వ్యాస్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. ఆరోపించిన టికెట్ స్కాల్పింగ్‌లో పాల్గొన్న పలువురు బ్రోకర్లను కూడా గుర్తించింది. ఈ ఉదంతంపై తదుపరి పరిశోధనలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. మరింత మందిని విచారించే అవకాశం ఉందని తెలిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు సంబంధించిన బ్లాక్ టికెటింగ్ మార్కెట్ యథేచ్ఛగా కొనసాగుతున్నా దానిపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.