హిట్‌ మూవీ థియేటర్ల వద్ద పోలీసు భద్రత!

ఇదే సమయంలో అమరన్‌ సినిమాకు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Update: 2024-11-10 09:40 GMT

శివ కార్తికేయన్‌, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ 'అమరన్‌' సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన అమరన్‌ సినిమా అన్ని చోట్ల భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది. ఇంకా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ అక్కడ, ఇతర రాష్ట్రాల్లోనూ అక్కడ అక్కడ సినిమా ఆడుతూనే ఉంది. మరో రెండు మూడు వారాలు అమరన్ థియేటర్ల నుంచి కదిలే అవకాశం కనిపించడం లేదు. ఇదే సమయంలో అమరన్‌ సినిమాకు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వారు 'అమరన్‌' సినిమాకు వ్యతిరేకంగా థియేటర్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ వారు ఆందోళన చేస్తున్నారు. దాంతో థియేటర్ల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ప్రభుత్వ వర్గాల వారికి థియేటర్ల యజమానులు, నిర్మాతల నుంచి అందిన విజ్ఞప్తి మేరకు పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అమరన్‌ నడుస్తున్న ఎక్కువ థియేటర్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ ఉన్నారు.

తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్‌ జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర పోరులో ప్రాణాలు వదిలారు. ఆయన వీర సైన్యం పొందినందుకు గాను దేశ అత్యున్నత సైనిక పురస్కారంను ఆయన భార్య రెబకా అందుకున్నారు. ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రను శివ కార్తికేయన్‌ పోషించి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాలో శివ కార్తికేయన్ కాకుండా వరదరాజన్‌ మాత్రమే కనిపించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సినిమాలో అత్యంత కీలకమైన వ్యక్తి సాయి పల్లవి. ఆమె వల్ల సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ టాక్‌ వినిపిస్తోంది.

రెబకా పాత్రలో సాయి పల్లవి నటించిన తీరుకు ఎంతటి వారు అయినా ఫిదా కావాల్సిందే. సహజమైన నటనతో భలే అందంగా కనిపించిన సాయి పల్లవి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె చూపించిన నటన ప్రతిభ కారణంగా సినిమా సూపర్‌ హిట్ అయింది. ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు ప్రతి సన్నివేశంలోనూ సాయి పల్లవి అద్భుతంగా నటించిందని రివ్యూలు వచ్చాయి. సినిమా సూపర్‌ హిట్ అయినా చిన్న వివాదం కారణంగా పోలీసు భద్రత నడుమ థియేటర్లను రన్‌ చేయాల్సి వస్తుందని తెలుస్తోంది.

Tags:    

Similar News