'అల వైకుంఠపురములో' తమిళ సినిమానా? వాట్ ఎ షేమ్ పూజా!
అంతేకాదు.. ఈ సినిమాతోనే బుట్టబొమ్మగా తెలుగు వారి ప్రేమాభిమానాలను చూరగొంది.
ముంబై బ్యూటీ పూజా హెగ్డే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో 'అల వైకుంఠపురములో' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా, సినిమా మొత్తం కథను నడిపించే అత్యంత కీలకమైన 'అల' పాత్రలో నటించింది పూజా. త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజా పాత్ర చుట్టూ సినిమాను నడిపించాడు. అంతేకాదు.. ఈ సినిమాతోనే బుట్టబొమ్మగా తెలుగు వారి ప్రేమాభిమానాలను చూరగొంది. ఇప్పటికీ పూజాను 'బుట్ట బొమ్మా' అంటూ ప్రేమగా, అభిమానంగా పిలుస్తారు తెలుగు ప్రజలు.
అలాంటి తెలుగు ప్రజలను పూజా తీవ్రంగా అవమానించింది. ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ''అల వైకుంఠపురములో తమిళ సినిమా'' అని వ్యాఖ్యానించింది. ''అల వైకుంఠపురములో నిజానికి తమిళ సినిమా.. ఇది పాన్-ఇండియా సినిమా కాదు. కానీ ప్రజలు దీనిని హిందీలో చూశారు. కాబట్టి పని బాగుంటే, అది ప్రజలకు చేరుతుంది'' అని పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మంచి కంటెంట్, పనితనం ఉన్న సినిమా ప్రజలకు చేరువవుతుందని పాజిటివ్ గా వ్యాఖ్యానించిన పూజా.. మరీ గుడ్డిగా ఒక తెలుగు సినిమాని తమిళ సినిమా అని వ్యాఖ్యానించడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూజా వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు.
బన్నీ సరసన బ్యాక్ టు బ్యాక్ డీజే, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్లలో అవకాశం అందుకున్న పూజా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదని సూచిస్తున్నారు. తెలుగు సినిమాకి ఘోర అవమానమిదని కూడా ఆవేదన చెందుతున్నారు. దక్షిణాది నిర్మాతలు, దర్శకులు, హీరోలు తాము నటించిన సినిమా భాష తెలియని హీరోయిన్లను ఎందుకు ప్రోత్సహిస్తారు? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చని కొందరు అన్నారు.
పాన్ ఇండియా మీనింగ్- టాలీవుడ్:
'ముకుంద' చిత్రంతో టాలీవుడ్ పూజాకు కథానాయికగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అగ్రహీరోలు అవకాశాలు కల్పించారు. తనకోసం ఎంత చేసినా కానీ పూజా తెలుగు పరిశ్రమను మర్చిపోయిందని కూడా విమర్శిస్తున్నారు.
నిజానికి తెలుగు సినిమా పాన్ ఇండియాలో అదరగొడుతోంది. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమను కీర్తిస్తున్నారు. మన సినిమాల డబ్బింగులకు ఉత్తరాదిన గొప్ప ఆదరణ దక్కుతోంది. తెలుగు సినిమాల రీమేక్ లలో నటిస్తూ హిందీ హీరోలు కెరీర్ ని నిలబెట్టుకుంటున్నారు. ఇక తమిళ సినీ పరిశ్రమలో ఎందరు దిగ్గజాలు ఉన్నాకానీ ఇప్పటివరకూ 1000 కోట్ల క్లబ్ ని కూడా అందుకోలేకపోయింది. వరుసగా 1000 కోట్ల క్లబ్ చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్న తెలుగు సినీపరిశ్రమను పూజా ఎలా మర్చిపోయింది? అన్నది ప్రజల ఆవేదన. పొరపాటున కూడా టాలీవుడ్ ని మర్చిపోకూడదు కదా? దేశ ప్రజలంతా వీక్షించే పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో పూజా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు.