అఫిషియల్‌ : మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో బుట్టబొమ్మ

టాలీవుడ్‌లో టాప్ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన పూజా హెగ్డే గత ఏడాదిలో ఒక్క సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది.

Update: 2025-02-27 07:49 GMT

టాలీవుడ్‌లో టాప్ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన పూజా హెగ్డే గత ఏడాదిలో ఒక్క సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది. 2023లోనూ ఈమె నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా మాత్రమే విడుదల అయింది. సల్మాన్ ఖాన్‌ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో తెలుగు, హిందీ సినిమాల్లో ఇక పూజా హెగ్డేకు ఆఫర్లు దక్కడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అలాంటి సమయంలో వరుసగా నాలుగు అయిదు సినిమాల్లో పూజా హెగ్డే ఆఫర్‌ దక్కించుకుంది. ఇటీవలే దేవా సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ బాలీవుడ్‌ మూవీ హిట్‌ అయితే పూజా హెగ్డే ఫేట్‌ మారేది. కానీ మరోసారి ఆమెకు నిరాశే మిగిలింది.


బాలీవుడ్‌లో దేవా నిరాశ పరచినా ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో సినిమా, విజయ్ చివరి సినిమా జన నాయగన్‌ సినిమాలోనూ ఈమె నటిస్తుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే కోలీవుడ్‌లో రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు వరుసగా సినిమా ఆఫర్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్‌లో కాంచన 4, హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే హిందీ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తూ ఉండగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే ప్రస్తుతం కూలీ సెట్స్‌లో ఉన్నట్లు ఎక్స్ ద్వారా అధికారికంగా పేర్కొన్నారు. సినిమాలో పాటకే ఈ అమ్మడు పరిమితం కానుందా లేదంటే ముఖ్య పాత్రలోనూ ఈమె కనిపించనుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో పూజా హెగ్డేకు ఇలా పెద్ద సినిమాల ఆఫర్లు ఆవడం కచ్చితంగా మంచి పరిణామం అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో ముకుంద, ఒకలైలా కోసం సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు నిరాశ పరిచిన ఆ తర్వాత నటించిన డీజే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా ఈ అమ్మడు నటించిన మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. కానీ కొన్ని కారణాల వల్ల తక్కువ సమయంకే టాలీవుడ్‌లో ఫేడ్‌ ఔట్‌ అయింది. తెలుగులో ఈమె చివరగా రాధేశ్యామ్‌, ఆచార్య సినిమాలో నటించింది. ఆ సినిమా నిరాశ పరచడం తో ఆఫర్లు పూర్తిగా కనుమరుగు అయ్యాయి అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Tags:    

Similar News