బాలీవుడ్ స్టార్లు సెట్స్‌కి లేట్‌గా వస్తారు.. దక్షిణాది స్టార్లు గ్రేట్!
బాలీవుడ్ లో క్రమశిక్షణ తక్కువ. వారితో పోలిస్తే దక్షిణాదిన స్టార్లు, టెక్నీషియన్ల క్రమశిక్షణ ఎంతో గొప్పదని అక్కడి వారు చెబుతుంటారు.;

బాలీవుడ్ లో క్రమశిక్షణ తక్కువ. వారితో పోలిస్తే దక్షిణాదిన స్టార్లు, టెక్నీషియన్ల క్రమశిక్షణ ఎంతో గొప్పదని అక్కడి వారు చెబుతుంటారు. ఇప్పుడు ప్రముఖ వెటరన్ స్టార్ పూనమ్ థిల్లాన్ దక్షిణాదికి కితాబిచ్చారు. ఓ సినిమా కోసం కమల్ హాసన్ తో కలిసి నటించానని, ఆ మసయంలో తనకు అనూహ్య సంఘటన ఎదురైందని పూనమ్ గుర్తు చేసుకున్నారు. కమల్ హాసన్ తనను తిట్టారని ఈ వెటరన్ నటి గుర్తు చేసుకున్నారు.
సహజంగానే తనకు షూటింగుకి ఆలస్యంగా వెళ్లే అలవాటు ఉంది. హిందీ చిత్రాల షూటింగుల సమయంలో అది అలవాటైంది. అగ్ర హీరోలు రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా లాంటి స్టార్లు సెట్స్ కి ఆలస్యంగా వస్తుండేవారని పూనమ్ థిల్లాన్ తెలిపారు. వారిని తాను కూడా అనుసరించి సెట్స్ కి ఆలస్యంగా వచ్చేదానిని అని తెలిపారు. అదే పద్ధతిలో సౌత్ లో ఓ సినిమా షూటింగ్ కోసం ఆలస్యంగా వెళ్లాను.
నేను సెట్‌లో మొదటిసారి తిట్లు తిన్నాను... కమల్ హాసన్ నన్ను తిట్టారు. ఎందుకంటే నేను సెట్‌కి ఆలస్యంగా వచ్చాను అని తెలిపింది. రాజేష్ ఖన్నా, శత్రుఘ్న వంటి స్టార్లతో తాను పని చేసాను. వారంతా ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేవారు. ఉదయం 7 గంటలకు రావాలి.. అని అడిగితే నాకు అర్థం కాదు. నేను ఉదయం 8 గంటలకే వచ్చేదానిని అని పూనమ్ చెప్పింది. ముంబైలో 30-45 నిమిషాలు ఆలస్యంగా రావడం పర్వాలేదు. నా సీనియర్లు అలానే చేసేవారు. దానివల్ల నేను స్వేచ్ఛ తీసుకోవడం అలవాటు చేసుకున్నాను! అని ఆమె గుర్తుచేసుకుంది.
అయితే చెన్నైలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఉదయం 7 గంటల షిఫ్ట్ కోసం రావాల్సి ఉండగా, ఉదయం 8 గంటలకు వచ్చానని, తాను ఆలస్యం కాలేదని భావించానని, కానీ కమల్ పక్కకు తీసుకెళ్లి బాగా తిట్టారు! అని తెలిపారు. నేను గుడ్ మానింగ్ చెప్పినా ఎవరూ స్పందించలేదు. గంభీరంగా కూచున్నారు. వారంతా ఉదయం 7 గంటల నుండి ఇక్కడే ఉన్నారు.. వాళ్ళ దగ్గర కార్లు లేవు.. దూరం నుండి వచ్చారు. లైట్‌మెన్లు, కెమెరామెన్లు టీమ్ అంతా... కాబట్టి వాళ్ళు తమ ఇంటి నుండి ఎప్పుడు బయలుదేరారో ఊహించుకోండి. వాళ్ళు ఉదయం 5 గంటలకు అంతకు ముందే నిద్రలేచి ఉంటారు.. మీరు 8 గంటలకు వచ్చారు. వాళ్ళంతా వేచి ఉన్నారు.. అది సరైనది కాదు! అని తిట్టారు.
కమల్ అన్ని విషయాలు ఎంతో చక్కగా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అంత పెద్ద స్టార్ ఆలస్యంగా రావొచ్చు.. కానీ ఆయన అలా చేయలేదు అని కూడా ప్రశంసించింది. దక్షిణాదిన సెట్లో టెక్నీషియన్లు కూడా ఎంతో మర్యాదగా నడుచుకుంటారని, స్టార్లు మందలిస్తే వారంతా శ్రద్ధగా ఉంటారని కూడా తెలిపింది. ఈ అనుభవం తనకు ఒక మేల్కొలుపు పిలుపు అని పూనమ్ చెప్పారు. అలాగే సెట్లో తనను చిత్రబృందం ఎంతో బాగా చూసుకున్నారని కూడా పూనమ్ థిల్లాన్ వెల్లడించింది. సాయంత్రం స్నాక్స్ వడ్డించినప్పుడు... మేము దానిని టిఫిన్ అని పిలుస్తాం. ఇడ్లీ, వడ, ఉత్తపం అని పిలుచుకుంటాం. నటులు మాత్రమే కాదు.. అందరూ దానిని తింటారు. దక్షిణాదిలో టెక్నీషియన్లను చాలా గౌరవిస్తారు! అని తెలిపింది.