పవన్, పోసానికి మధ్య ఎక్కడ చెడింది.. పోసాని సినీ కెరీరూ క్లోజేనా?

సినీ రంగంలో మెగా ఫ్యామిలీగా టాలీవుడ్ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సోదరుడుపై పోసాని వ్యాఖ్యలు హద్దులు దాటాయనే అభిప్రాయం ఉంది;

Update: 2025-02-28 19:03 GMT

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై దూషణలకు పాల్పడ్డారనే ఆరోపణలో అరెస్టు అయిన సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినీ రంగంలో మెగా ఫ్యామిలీగా టాలీవుడ్ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సోదరుడుపై పోసాని వ్యాఖ్యలు హద్దులు దాటాయనే అభిప్రాయం ఉంది. రాజకీయ కోణంలో ఆయన విమర్శలు చేసినా సుదీర్ఘ సినీ కెరీరులో మెగా కుటుంబంలోని హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన పోసాని ఆ స్థాయిలో ఎందుకు విమర్శలు చేయాల్సివచ్చింది..? దాని పర్యావసనాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

పోసాని క్రిష్ణమురళి సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్టు, బెస్టు కమెడియనుగా అందరికీ తెలుసు. ఆయనలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నారని కూడా సినీ రంగంతో పరిచయం ఉన్నవారికి అవగాహన ఉంటుంది. అయితే సినీ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న పోసాని టాలీవుడ్ లోని పలుకుబడి ఉన్న మెగా కుటుంబంతో పెట్టుకోవడం, అదే సమయంలో టాలీవుడ్ దేవుడిగా భావించే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా వ్యక్తిగత దూషణలకు దిగడమే గమనార్హం అంటున్నారు. ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయాలకు దూరంగా ఉన్నా, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు, కార్యకర్తలు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారని, అందుకే సమయం చూసి యాక్షన్లోకి దిగారని అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయం పోసాని అరెస్టు సందర్భంగా మరోసారి చర్చకు దారితీస్తోంది.

సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసానికి రాజకీయాలంటే ముందు నుంచి ఆసక్తి ఉండేదని చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను రాజకీయాలకు అతీతంగా ప్రశంసించిన పోసాని.. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు దగ్గరైన పోసాని ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటుంటారు. ప్రస్తుతం రాజకీయాల నుంచి వైదొలుగుతున్న ఎప్పటికీ జగన్ అభిమానిగా ఉంటానని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న పోసాని.. చంద్రబాబు, పవన్ ను తిట్టిన దానికి బహుమతిగా ఆ పదవిని అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అత్తారింటికి దారేది, లోఫర్ వంటి సినిమాల్లో మెగా బ్యానర్ కింద నటించిన పోసాని కేవలం రాజకీయ కారణాలతో వ్యక్తిగత దూషణలకు దిగాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదని అంటున్నారు.

అయితే పోసాని, పవన్ మధ్య రచ్చకు 2021లో జరిగిన రచ్చ కారణమనే వాదన వినిపిస్తోంది. మెగా కాంపౌడ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా టికెట్ ధరపై అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. అయితే పవన్ వ్యాఖ్యలపై పోసాని ప్రతిస్పందించడం, దీనికి ప్రతిగా పవన్ అభిమానులు పోసాని ఇంటిపై దాడి చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పవన్ అభిమానులు తన ఇంటిపై దాడి చేయడాన్ని సహించలేని పోసాని ఆగ్రహం, ఆవేశం తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగారు. అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉండటంతో ఎవరూ పోసానిని నియంత్రంచలేకపోయారని అంటున్నారు. ఇక అప్పటి నుంచి పోసాని మాటలను మరింత పదునెక్కించి సోషల్ మీడియాను ఆకర్షించారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి దూరమైన పోసాని రాజకీయంగా కూడా ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనపై ఏపీలోని వివిధ జిల్లాల్లో కేసులు నమోదు అవడంతో వెనక్కి తగ్గారు. రాజకీయాలకు ఓ దండం పెట్టి ఇంటికే పరిమితమైనా ప్రభుత్వం, కూటమి కార్యకర్తలు ఆయనను క్షమించలేదని తాజా ఎపిసోడ్ నిరూపించిందని అంటున్నారు. మరోవైపు కమెడియన్ గా రాణిస్తున్న సమయంలో కీలకమైన రెండు కుంటుంబాలతో వైరం పెట్టుకోవడంతో ఆయనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయంటున్నారు. ఆ ప్రస్టేషన్ కూడా పోసానిలో ఎక్కువై కంట్రోల్ తప్పిపోయారా? అని అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News