'ఫౌజీ' కాంబో ఒక్కటితో ఆగేలా లేదు..!
ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు హను చెప్పిన ఒక స్టోరీ లైన్‌కి ప్రభాస్ ఫిదా అయ్యాడట.;

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' సినిమాలో నటిస్తున్నాడు. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న రాజాసాబ్ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రాజాసాబ్‌తో సమాంతరంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఫౌజీ సినిమాతో పాటు ప్రభాస్ మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పాడు. ఈ ఏడాదిలోనే సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు సలార్ 2, కల్కి 2 సినిమాలను సైతం ప్రభాస్ చేయాల్సి ఉంది.
ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సినిమాలు కాకుండా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగా మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హను రాఘవపూడి దర్శకత్వంలోనే మరో సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు. ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు హను చెప్పిన ఒక స్టోరీ లైన్‌కి ప్రభాస్ ఫిదా అయ్యాడట. ఆ సినిమాను తానే చేస్తాను అని స్వయంగా ప్రభాస్ ముందుకు వచ్చాడని, అంతే కాకుండా నిర్మాతను సైతం తానే సెట్ చేశాడని తెలుస్తోంది.
ప్రభాస్‌కి అత్యంత సన్నిహితుడు అయిన ఒక నిర్మాత ఇప్పటికే ఫౌజీ తర్వాత సినిమా కోసం హను రాఘవపూడికి అడ్వాన్స్ రూపంలో భారీ మొత్తంను ఇచ్చాడట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఆ నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించబోతున్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా హను రాఘవపూడితో రెండో సినిమా మొదలు కావడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఫౌజీ సినిమా ఫలితం ఏంటి అనేది తేలకుండానే హను రాఘవపూడితో మరో సినిమాను చేసేందుకు ప్రభాస్ రెడీ కావడం నిజంగా షాకింగ్‌గా ఉంది అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హను రాఘవపూడి గత చిత్రం 'సీతారామం' మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈయన ప్రేమ కథలు క్లాసిక్‌గా నిలిచి పోతున్నాయి. అందుకే ప్రభాస్ ఈయన దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్‌తో మరో సినిమాకు ఎలాగూ టైం పడుతుంది కనుక హను రాఘవపూడి ఫౌజీ తర్వాత మరో సినిమాను వేరే హీరోతో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్, హను రాఘవపూడి కాంబో ఒక్క సినిమాతో ఆగేలా లేదు.