బడా మల్టీస్టారర్.. సింగిల్ సిట్టింగ్ లో రిజెక్ట్ చేసిన ప్రభాస్

ఈ క్రేజ్‌ను కొనసాగిస్తూ సిద్దార్థ్ ఒక మల్టీ స్టారర్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఒక ప్రధాన పాత్రకు షారుఖ్ ఖాన్ ను ఫైనల్ చేశారు. మరో లీడ్ పాత్రలో ప్రభాస్ ని తీసుకోవాలని ఆయన అనుకున్నారు.

Update: 2024-10-30 00:30 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్టీ స్టారర్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా తారాస్థాయికి చేరుకుంది. మరింతగా ప్రాచుర్యం పొందిన మల్టీ యూనివర్స్ చిత్రాలు, క్రేజీ కాంబినేషన్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మార్గంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇటీవల పలు క్రేజీ కాంబినేషన్లు పరిశీలనలో ఉన్నా ప్రభాస్ మాత్రం ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కలిసి ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని చాలా కాలం క్రితమే ప్లాన్ చేశారు. పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతూ వస్తోంది. ఇదే సమయంలో సిద్దార్థ్ ఆనంద్ హిందీలో షారుఖ్ ఖాన్ తో చేసిన పఠాన్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిద్దార్థ్ పై పలు ప్రముఖ హీరోల నుంచి ఆసక్తి చూపించడం మొదలైంది.

ఈ క్రేజ్‌ను కొనసాగిస్తూ సిద్దార్థ్ ఒక మల్టీ స్టారర్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఒక ప్రధాన పాత్రకు షారుఖ్ ఖాన్ ను ఫైనల్ చేశారు. మరో లీడ్ పాత్రలో ప్రభాస్ ని తీసుకోవాలని ఆయన అనుకున్నారు. కానీ ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లోనే మరో ఆలోచన లేకుండా ఈ క్రేజీ ఆఫర్‌ని తిరస్కరించారని తెలుస్తోంది. మల్టీ స్టారర్ కాన్సెప్ట్‌ లు ప్రస్తుతం చేయాలని అనుకోవడం లేదని సిద్దార్థ్ ఆనంద్ కి తెలిపారని టాక్.

ప్రభాస్ మల్టీ స్టారర్ సినిమా కన్నా ఒక సోలో హీరోగా మాత్రమే కొనసాగాలని అభిప్రాయపడ్డారట. ప్రభాస్ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ లేకుండా సిద్దార్థ్ ఆనంద్ ఒక కొత్త స్క్రిప్ట్‌తో రావాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నారు.

అదేవిధంగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 చిత్రాలు 2025 లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు సిద్దార్థ్ ఆనంద్ మరో లీడ్ రోల్ కోసం ఇతర హీరోలను పరిశీలిస్తున్నారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్లో కొంత నిరాశనును అయితే కలిగించింది, ప్రభాస్ అయితే ఆ విషయంలో క్లారిటీగా ఉన్నారట. ఇప్పట్లో ఇలాంటి ప్రయోగాలు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News