రాజా సాబ్‌కు బ్రేక్ లేదు, ఫౌజీకి చిన్న గ్యాప్

అయితే తాజాగా ప్రభాస్ సన్నిహిత వర్గాలు ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Update: 2024-12-16 16:49 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల షూటింగ్ సమయంలో స్వల్ప గాయానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్త బయటకు రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా ప్రభాస్ సన్నిహిత వర్గాలు ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గాయం పెద్ద ప్రమాదకరమైనది కాదని, స్వల్ప విరామం తీసుకుంటున్నారని వారు స్పష్టం చేశారు.

ప్రభాస్ రీసెంట్ గా 'రాజా సాబ్' షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొన్నారు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందని సమాచారం. దీంతో ఈ సినిమాకు ప్రభాస్ గాయం ఎలాంటి ప్రభావం చూపదని నిర్మాతలు కూడా స్పష్టం చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారు.

అయితే గాయంతో ప్రభాస్ ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ అయిన 'ఫౌజీ' షూటింగ్‌కు మాత్రమే బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో జరుగుతోంది. ఈ చిత్రానికి స్వల్ప విరామం తప్పనిసరి అయినా, ప్రభాస్ త్వరలోనే తిరిగి షూటింగులలో పాల్గొంటారని ఆయన సన్నిహితులు తెలిపారు.

గాయం గురించి ఇప్పటికే మేకర్స్ కు ప్రభాస్ కూడా స్వయంగా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. అందరూ ఆందోళన చెందవద్దని నా గాయం పెద్దది కాదని చెప్పారట. అలాగే త్వరలోనే షూటింగ్ కి వస్తానని మైత్రి నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ లీక్స్ తో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రభాస్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 ఏ.డి' మరో భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రం జపాన్‌లో వచ్చే ఏడాది జనవరి 3న విడుదల కానుంది. గాయం కారణంగానే డిసెంబర్ 18న జరగాల్సిన ప్రమోషన్లకు ప్రభాస్ హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్లు, మూవీ టీమ్ భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అభిమానులు ప్రభాస్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. 'రాజా సాబ్', 'ఫౌజీ', పలు బిగ్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ స్వల్ప విరామం తరువాత మరింత ఎనర్జీతో తిరిగి షూటింగుల్ని ప్రారంభించనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News