భారతీయ సినీపరిశ్రమలో ప్రయోగాలతో సత్తా చాటే ఏకైక హీరో
బ్యాక్ టు బ్యాక్ కొన్ని ప్రయోగాత్మక చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టి భారతదేశంలో కచ్ఛితంగా మార్కెట్ పరంగా ఆధారపడదగ్గ స్టార్ గా ప్రభాస్ మాత్రమే కనిపిస్తున్నాడు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్న స్టార్ హీరోలు భారతదేశంలో చాలామంది ఉన్నారు. బాలీవుడ్ లో ఖాన్‌ల త్రయం కానీ, టాలీవుడ్ లో ఉన్న అరడజను అగ్ర హీరోలు కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయగలిగిన ధీమాను కలిగి ఉన్నారు. దశాబ్ధాల పాటు పరిశ్రమలో వేళ్లూనుకుని, బాక్సాఫీస్ వద్ద తమని తాము నిరూపించుకుని ఎప్పటికీ స్టార్ హీరోగా కొనసాగే వీరందరిలో కచ్ఛితంగా ప్రయోగాలు చేయగలిగే స్టార్ ఎవరు? అన్నది ఆరా తీస్తే...
ఇటీవల ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ కొన్ని ప్రయోగాత్మక చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టి భారతదేశంలో కచ్ఛితంగా మార్కెట్ పరంగా ఆధారపడదగ్గ స్టార్ గా ప్రభాస్ మాత్రమే కనిపిస్తున్నాడు. అతడు వరుసగా మూడు నాలుగు భారీ పరాజయాలు అందుకుని కూడా రెండే రెండు బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ అయిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ నటించిన `సలార్` గ్రాండ్ సక్సెస్ తర్వాత వెనువెంటనే `కల్కి 2989 ఏడి` చిత్రంతో సంచలన విజయాన్ని నమోదు చేసాడు. కల్కి చిత్రం ఇండస్ట్రీలో అంతకుముందు ఉన్న చాలా రికార్డులను ఛేజ్ చేయడంలో సక్సెస్ సాధించిందని టాక్ వినిపించింది. ఇటీవల షారూఖ్ నెలకొల్పిన జవాన్ రికార్డుల్ని ఇది తుడిచేసింది. ఇప్పుడు ప్రభాస్ నటించనున్న సలార్ 2, కల్కి 2989 ఎడి సీక్వెల్ లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు ప్రయోగాత్మక చిత్రాలు కావడం, దానికి తోడు 1000 కోట్లు సునాయాసంగా తేగలిగిన స్టార్ గా ప్రభాస్ వీటిలో హీరోగా కొనసాగుతుండడం చూస్తుంటే మునుముందు కచ్చితంగా మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రయోగాత్మక సినిమాల్లో నటించే సత్తా ప్రభాస్ కి మాత్రమే ఉంటుందనే ధీమా కూడా ఇప్పుడు ఉంది.
ప్రభాస్ ఇప్పుడు భారతదేశంలో మార్కెట్ల పరంగా అత్యంత ఆధారపడదగిన స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అతడి పరాజయం తెచ్చిన నష్టాల కంటే విజయాలు తెచ్చే లాభాల శాతం చాలా ఎక్కువ. అలాగే అతడి సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా ఓపెనింగులతోనే సునాయాసంగా సగం మూవీ బడ్జెట్ రికవరీ అయిపోతోంది.
దీంతో నిజమైన పాన్ ఇండియా స్టార్ డమ్ అతడి సొంతమైంది. ఖాన్ లు.. కపూర్ లను వెనక్కి నెట్టిన ఏకైక సౌత్ స్టార్ గా ప్రభాస్ వెలిగిపోతున్నాడు. భారతీయ సినిమా అంటే హిందీ సినిమానే అని భావించే టైమ్ లో అతడు చరిత్రగతిని మార్చాడు. సిసలైన దేశీ సినిమా టాలీవుడ్ నుంచే వస్తుంది అని నిరూపించగలిగాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అన్నీ ప్రయోగాలే చేసాడు. కొన్ని ఫెయిలైనా ఇప్పుడు రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. తదుపరి మారుతి, హను రాఘవపూడి వంటి డైరెక్టర్లతోను అతడి సినిమాలు ప్రతిష్ఠాత్మకంగా విడుదలకు వస్తాయి.
భవిష్యత్ లో గ్యారెంటీగా 1000 కోట్ల క్లబ్ సినిమాలను అందించే స్టార్ గా అతడికి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం దక్కుతోంది. నిన్న మొన్నటి వరకూ అంగీకరించేందుకు నామోషీ ఫీలైన బాలీవుడ్ స్టార్లు సైతం ఇప్పుడు ప్రభాస్ ని దేశంలో అతిపెద్ద స్టార్ గా అభివర్ణిస్తుండడం చూస్తుంటే, మన తెలుగు స్టార్ ఘనతను కచ్ఛితత్వంతో అంచనా వేయాలి. డార్లింగ్ ప్రభాస్ భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న తీరు అసమానం.. నిజంగా ఆశ్చర్యకరం.