అయోధ్యకు ప్రభాస్ 40కోట్లు.. ఇదీ అసలు నిజం!
22 -01-2024 ఇది ఎంతో ప్రత్యేకమైన తేదీ. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న డేట్ ఇది
22 -01-2024 ఇది ఎంతో ప్రత్యేకమైన తేదీ. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న డేట్ ఇది. ఆరోజు దశాబ్ధాల భారతీయుల కల నెరవేరబోతోంది. శతాబ్ధ కాలంగా చర్చల్లో ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక కొలిక్కి వచ్చి, ఈనెల 22న శ్రీరాముని విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. అయితే ఈ విగ్రహావిష్కరణ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి, ఆయన వారసుడు చరణ్ కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా ఆహ్వానం అందిందని, అతడు కూడా అయోధ్యకు వెళుతున్నాడని ప్రచారమైపోయింది. దీనికి అదనంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం నాడు పోటెత్తే భక్తుల ఆకలి తీర్చడం కోసం ప్రభాస్ నగరంలో 30 చోట్ల భోజనాలు ఏర్పాటు చేసాడని, దానికోసం అతడు ఏకంగా 40కోట్లు ఖర్చు చేస్తున్నాడని కూడా పనిలో పనిగా ప్రచారమైపోతోంది.
గత కొద్దిరోజులుగా ప్రతి మూల మూలకు ఈ ప్రచారం చేరిపోయింది. ప్రభాస్ అభిమానులతో పాటు, సాధారణ ప్రజలు దీనిని నమ్మారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అయోధ్య రాముని విగ్రహావిష్కరణ కోసం విచ్చేస్తున్న ప్రజల కోసం ప్రభాస్ ఇలాంటి గొప్ప సేవ చేయడంపై పలువురు సోషల్ మీడియాల్లో ప్రశంసలు కూడా కురిపించారు. అయితే ఇది నిజమా? అన్నది ఆరా తీస్తే షాకిచ్చే విషయం తెలిసింది.
తాజాగా ప్రభాస్ సన్నిహిత బృందాలు ఈ వార్తలను ఖండించారు. ప్రభాస్ అలాంటి విరాళం ఏమీ ఇవ్వలేదని ఆశ్చర్యకరంగా ఈ వేడుకకు కూడా ఆహ్వానించలేదని స్పష్టం చేసారు. ఈ క్లారిటీ చాలా మంది అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ని ఇలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఆహ్వానించకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామందిని ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్ పెదనాన్న గారు కృష్ణంరాజు చాలా కాలం భాజపాలో కొనసాగారు. పార్టీలో పదవులు చేపట్టి సేవలందించారు. ఇంతకుముందు బాహుబలి - బాహుబలి 2 చిత్రాలు అఖండ విజయం సాధించాక, కృష్ణంరాజు- ప్రభాస్ ఇరువురూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. కానీ ఇవేవీ ప్రభుత్వాధీశులకు కనీస మాత్రంగా అయినా గుర్తుకు రాలేదా? అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
అయితే ఇవేవీ పట్టని ప్రభాస్ ప్రస్తుతం సలార్ విజయాన్ని ఆస్వాధించే పనిలో ఉన్నాడు. సలార్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 700కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఇప్పుడు పార్ట్ 2 పైనా సీరియస్ గా దృష్టి సారించనున్నాడని తెలిసింది. మరోవైపు ప్రభాస్ తదుపరి పాన్ ఇండియా వెంచర్ 'కల్కి 2898 AD' కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన మైథో సైన్స్ ఫిక్షన్ చిత్రం 9 మే 2024న థియేట్రికల్ గా విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దేవరకొండ, దుల్కార్ సల్మాన్ తదితరులు నటిస్తున్నారు.