నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ!
ప్రముఖ తమిళ నటుడు ప్రభు గణేశన్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో బ్రెయిన్ అనూరిజం శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రముఖ తమిళ నటుడు ప్రభు గణేశన్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో బ్రెయిన్ అనూరిజం శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రభు పీఆర్వో చిన్న తంబి మీడియాతో మాట్లాడుతూ.. డిశ్చార్జ్ తర్వాత నటుడు ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నారని, కోలుకుంటున్నారని వెల్లడించారు. ``ప్రభు సార్ ఒక చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వెంటనే డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఇంట్లో కోలుకుంటున్నారు. అంతా క్షేమంగా ఉన్నారు`` అని వెల్లడించారు.
తాజా మీడియా కథనాల ప్రకారం.. ప్రభు జ్వరం, తలనొప్పి లక్షణాలతో మెడ్వే హార్ట్ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రిలో చేరాడు. అతడి మెదడులో మధ్య మస్తిష్క ధమని విభజన వద్ద అంతర్గత కరోటిడ్ ధమని పైభాగంలో ఉబ్బి ఉన్నట్లు గుర్తించామని, ఇది పెద్ద మెదడు భాగానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం`` అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయాక ప్రభు ఇంట్లో కోలుకుంటున్నారు.
1980లు, 90లలో తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుల్లో ప్రభు ఒకరు. ఇలయ తిలగం అనే బిరుదును అతడు అందుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో 220 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా, సహాయక నటుడిగాను ఆయన కొనసాగారు. తమిళ అనువాద చిత్రాలతో ప్రభు తెలుగువారికి బాగా సుపరిచితుడు. ప్రభు వెటరన్ స్టార్ శివాజీ గణేషన్ కుమారుడు. ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు కూడా కథానాయకుడు అన్న సంగతి తెలిసిందే. గుంకీ (ఏనుగు) చిత్రంతో తెలుగు వారికి విక్రమ్ ప్రభు సుపరిచితుడయ్యారు.
తళా అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంలోను ప్రభు కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రభు గణేశన్, త్రిష కృష్ణన్, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు.