అఅఇఅతో యాంకర్ హీరోకు ఊరట లభించినట్టేనా?
ప్రదీప్ తొలిసారి హీరోగా అరంగేట్రం చేసిన మూవీ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?`. 2021లో విడుదలైన ఈ మూవీ ఫరవాలేదు అనిపించింది.;

బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారు వెండితెరపై కూడా తమ సత్తాను చాటి హీరోలుగా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. శివాజీ, అనసూయ, కలర్స్ స్వాతి వంటి వారు బుల్లితెర నుంచి వెండితెరపై రాణించడం తెలిసిందే. వీరి తరహాలోనే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, ఝాన్సీ కూడా వెండితెరపై సక్సెస్ అయ్యారు. వీళ్ల తరహాలోనే యంగ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా బుల్లి తెరపై పేరు తెచ్చుకుని సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలు పెట్టాడు.
ప్రదీప్ తొలిసారి హీరోగా అరంగేట్రం చేసిన మూవీ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?`. 2021లో విడుదలైన ఈ మూవీ ఫరవాలేదు అనిపించింది. మళ్లీ మూడేళ్ల విరామం తరువాత ప్రదీప్ కామెడీ డ్రామా `అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి`లో నటించాడు. జబర్దస్త్‌తో పాటు ఆహాలో పలు ప్రోగ్రామ్‌లకు ప్రొడ్యూసర్స్‌గా, డైరెక్టర్స్‌గా వ్యవహరించిన నితిన్ - భరత్ ఈ మూవీతో దర్శకులుగా పరిచయం అయ్యారు.
దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని విభిన్నమైన కథతో కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించారు. టీమ్, ట్రైలర్స్‌తో ఆసక్టిని రేకెత్తించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`, స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ `జాక్` మూవీలతో కలిసి ప్రదీప్ నటించిన `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు యావరేజ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
అయినా సరే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా రెండవ రోజు వసూళ్లు మరింతగా పెరగడం విశేషం. ఈ సినిమాకు రూ.3.8 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 3.74 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. మరో రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగితే ప్రదీప్ సినిమా గట్టెక్కినట్టే. అదే జరిగితే యాంకర్ ప్రదీప్‌కు హీరోగా భారీ ఊరట లభించినట్టే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.