'వచ్చాక అన్నీ చెప్తా'.. పవన్ కు ప్రకాష్ రాజ్ రిప్లై
తిరుమల లడ్డూ వ్యవహారం.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
తిరుమల లడ్డూ వ్యవహారం.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని సైతం తాకింది! ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. మెట్లు శుభ్రం చేసి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.
నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ స్పందించిన సంగతి తెలిసిందే. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నానని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోండని సూచించారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. వీడియో రిలీజ్ చేశారు.
తాను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నానని తెలిపారు ప్రకాష్ రాజ్. ఇండియా వచ్చాక అన్నింటికీ ఆన్సర్స్ ఇస్తానని అన్నారు. 'పవన్ కల్యాణ్ గారు.. ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పిన విషయాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వస్తాను. అప్పుడు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఇంతలో మీకు వీలు ఉంటే నా ట్వీట్ ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అసలు ఆయనేం ట్వీట్ చేశారు?
కొన్ని రోజుల క్రితం.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ లడ్డూ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. 'మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన. కాబట్టి సమగ్రంగా విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు అనవసర భయాలు కల్పిస్తున్నారు ? జాతీయస్థాయిలో చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారు ? దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు (సెంటర్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కు ధన్యవాదాలు)' అని ప్రకాష్ రాజ్ రాసుకొచ్చారు.
అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు ఇప్పటికే మంచు విష్ణు రిప్లై ఇచ్చారు. దయచేసి అంతగా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని, కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. మీ పరిధిలో ఉండాలని విష్ణు ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. మళ్లీ ఇండియా వచ్చాక ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.