దళపతి విజయ్‌కి సరైన విలన్ దొరికాడు
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దాదాపుగా టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ విలన్ గా నటించారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దాదాపుగా టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ విలన్ గా నటించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, విజయ్, సూర్య, విక్రమ్ సహా ఎందరో దిగ్గజ హీరోల సినిమాల్లో విలనీని అద్భుతంగా పండించారు. అప్పుడప్పుడు బొమ్మరిల్లు ఫాదర్ తరహా పాత్రలతోను అలరించారు. సహాయనటుడిగా విలన్ గా దర్శకుడిగా నిర్మాతగా తనలోని విలక్షణతను చాటుకున్నాడు ప్రకాష్ రాజ్. అయితే ఇటీవలి కాలంలో రాజకీయాలతో అంటకాగి, దర్శకత్వం పేరుతోను అతడు నటనకు దూరంగా ఉన్నాడనే చెప్పాలి.
అడపాదడపా కొన్ని ముఖ్యమైన సినిమాల్లో కనిపించాడు తప్ప, పెద్దగా అతడి ఉనికి కనిపించలేదు. ఇది అభిమానులకు కొంత లోటుగా కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు దక్షిణాదికి చెందిన అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది నిజంగా అభిమానులకు పెద్ద వార్త. మరింతగా వివరాల్లోకి వెళితే....
దళపతి విజయ్ తన చివరి ప్రాజెక్ట్‌తో నటనకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సంపూర్ణంగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఇది అతడి నిర్ణయం. తాజా చిత్రానికి తాత్కాలికంగా దళపతి 69 అని పేరు పెట్టారు. దీనికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజా కథనాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో నటుడు ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే దీనికి ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. దళపతి విజయ్ - ప్రకాష్ రాజ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. గతంలో గిల్లి (2004), శివకాశి (2005), పొక్కిరి (2007) మరియు విల్లు (2009) వంటి అనేక హిట్ చిత్రాలలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. దళపతి 69లో సిమ్రాన్, పూజా హెగ్డే, సమంతా రూత్ ప్రభు, మోహన్‌లాల్, మమితా బైజు వంటి పెద్ద తారలు నటించే వీలుందని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవలి కథనాల ప్రకారం.. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించే అవకాశం ఉందని టాక్ వినిపించింది. కానీ ఇంతలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తోంది.
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న దళపతి 69ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రొడక్షన్ హౌస్ ఇటీవల ఈ చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించగా అద్భుత స్పందన వచ్చింది. ``టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ`` (ప్రజాస్వామ్యానికి దివిటీ(కాగడా)) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ వివరాలను టీమ్ ప్రకటించింది. అలాగే దళపతి విజయ్ తన చివరి చిత్రంతో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటుడవుతున్నాడని కూడా కథనాలొచ్చాయి. దళపతి 69 కోసం విజయ్ కి 275 కోట్లు ఆఫర్ చేసారని కూడా గుసగుసలు వినిపించాయి.
తాజా సమాచారం మేరకు.. దళపతి 69 ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది. దళపతి 69 తర్వాత విజయ్ తన రాజకీయ పార్టీ `తమిళగ వెట్రి కజగం`తో తన రాజకీయ జీవితంపై మాత్రమే దృష్టి పెడతాడు. వెటరన్ డే నాయకులు బిఆర్ అంబేద్కర్, పెరియార్, కె కామరాజ్‌లను గౌరవించి కేంద్రం నుండి వామపక్ష వైఖరిని అవలంబించాలని విజయ్ తన పార్టీ క్యాడర్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కె కామరాజ్ మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నాయకులను పార్టీ సైద్ధాంతిక స్ఫూర్తికి ప్రాథమిక వనరులుగా విజయ్ భావిస్తున్నారని కథనాలొస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం అంబేద్కర్ ఇండ్రమ్ ఎండ్రమ్ (అంబేద్కర్ టుడే అండ్ ఫరెవర్) పుస్తకాన్ని చదువుతున్నాడని కూడా తెలుస్తోంది. బడుగు బలహీన వర్గాలు, పేదలకు అండగా నిలిచే నాయకుడు కావాలన్నది విజయ్ ఆలోచన అని కూడా టాక్ వినిపిస్తోంది.